బిజెపి నాయకులను తరిమికొట్టాలి : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Thursday February 10, 2022
బెల్లంపల్లి ఫిబ్రవరి 9 ప్రజా పాలన ప్రతినిధి: అప్పుల బారి నుండి బయటపడి కార్మికుల సమిష్టి కృషితో లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థ ను ప్రైవేటు వారికి అప్పగించి కార్మికుల కుటుంబాలను ఇబ్బందులపాలు చేస్తున్న, కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకులను తరిమికొట్టాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం నాడు స్థానిక కాంట చౌరస్తాలో ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వ సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన దీక్షకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ పార్టీలపై, రాష్ట్రాలపై, సవతి తల్లి ప్రేమ చూపిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూ తమ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నారని, అందులో భాగంగానే సింగరేణి సంస్థలోని మంచిర్యాల, కొత్తగూడెం, జిల్లాలోని నాలుగు సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయడాన్నీ నిరసిస్తూ టెండర్లను రద్దు చేసుకొని సింగరేణి గనులను సింగరేణి కే అప్పగించాలని ఆయన అన్నారు. లేనిపక్షంలో సింగరేణి సంస్థను నిర్వీర్యం చేస్తున్న బిజెపి నాయకులను సింగరేణి కార్మికుల వద్దకు వస్తే తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కార్మిక నాయకులు, బెల్లంపల్లి నియోజకవర్గ టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు, బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఉమ్మడి  ఆదిలాబాద్ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వస్తారని అనుకున్నా సాయంత్రం 6 గంటల వరకు రాకపోవడంతో నిర్వాహకులు నిరాశ, నిస్పృహలతో కార్యక్రమం ముగించుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది.