ప్రజల భాగస్వామ్యంతోటే హరి తహారం సాధ్యం

Published: Tuesday July 06, 2021
బాలాపూర్, జులై 05, ప్రజాపాలన ప్రతినిధి : పట్టణ ప్రగతి, స్వేచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా పచ్చని వనంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కార్పొరేషన్ మేయర్ పేర్కొన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్ కార్పొరేటర్ రాళ్ల గూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమంలో భాగంగా రోమా ఎంక్లేవ్ లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్ విచ్చేసి స్థానిక కార్పొరేటర్ రాళ్ల గూడెం సంతోషి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..... పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కాలనీలలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించాలని, కార్పొరేషన్ ను స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా పచ్చని వనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరు మొక్కలు నాటి రక్షించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యం తోటే హరితహారం సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో డి ఈ అశోక్ రెడ్డి, ఏఈ బిక్క నాయక్, శానిటేషన్ సిబ్బంది, నగర దీపికలు, కాలనీవాసులు పాల్గొన్నారు.