పోడు రైతుల పై దాడులు చేస్తే సహించం తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్అం తర్రాష్ట్ర

Published: Tuesday July 12, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూలై 11(ప్రజాపాలన, ప్రతినిధి) : పోడు దారులపై దాడులు చేస్తే సహించేది లేదని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక విజయ్ అన్నారు. దండేపల్లి మండలం కోయపోచగుడ లో జరిగిన సంఘటనకు నిరసిస్తూ సోమవారం బంద్ పిలుపు నేపథ్యంలో దుకాణాలు బంద్ చేయించి ప్రయాణ ప్రాంగణం ఎదుట అంతర్రాష్ట్ర రహదారి పై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్నాక విజయ్ మాట్లాడుతూ కోయపోచగూడెంలో మహిళా అని చూడకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు వారిని ఈడ్చి కెళ్ళి వాహనాల్లో ఎక్కించడం దారుణమన్నారు. అడవులను కాపాడడంలో ఆదివాసీల పాత్ర వెలకట్టలేనిదని, ఇది చరిత్ర చెబుతున్న సత్యం అన్నారు. అలాంటి ఆదివాసుల పై టిఆర్ఎస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందని 8 సం రాలలో ఆదివాసీలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం కల్పించిన హక్కులను కూడా  వారికి అందకుండా ప్రభుత్వం అడ్డు పడుతుందని ఆరోపించారు. ఆదివాసీలు ఒకసారి ముందుకు కదిలితే తలలు తెగి పడ్డ ఉద్యమాన్ని ఆపాలని, ఈ విషయాన్ని కెసిఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పోడు సాగు దారులకు సీఎం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని వారికి పట్టాలు ఇచ్చి, కోయపోచగూడా బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలకు తాము ఎప్పుడు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ ధర్నా కార్యక్రమంలో తుడుం దెబ్బ వాంకిడి మండల అధ్యక్ష కార్యదర్శులు రాంశావ్, సాయినాథ్, సోయం, రహిమాన్, నాయకులు కిష్టయ్య, మాణిక్ రావు, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.