రేషన్ షాపులు, గోదాములను ఆకస్మిక తనిఖీ

Published: Tuesday December 27, 2022
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 26 డిసెంబర్ ప్రజాపాలన : ప్రజా పంపిణీ వ్యవస్థలో  చౌక ధర దుకాణాల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులు అందించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని శ్రీరామ్ నగర్  కాలనీలో గల చౌక ధర దుకాణాన్ని, వికారాబాద్ పట్టణంలోని పౌరసరఫరాల గోదామును పరిగి మండలంలోని నస్కల్, సయ్యద్ పల్లి గ్రామాలలో గల చౌక ధర దుకాణాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.   ఈ సందర్భంగా దుకాణాలలో నిర్వహించే స్టాక్ రిజిస్టర్, స్టాక్ తెలిపే బోర్డులను, బయోమెట్రిక్  ఈ-పాస్ యంత్రాలను పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ ప్రకారము ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ వివరాలు పరిశీలించారు.   ఒక్కొక్క షాపులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు.  లబ్ధిదారులందరికీ సకాలంలో రేషన్ బియ్యం అందించాలని సూచించారు.   పౌరసరఫరాల గోదాంలో గల తూకం యంత్రాన్ని స్టాక్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించినారు.  డీలర్లకు సకాలంలో కమిషన్ డబ్బులు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సయ్యద్ పల్లి గ్రామంలో  రేషన్ దుకాణాన్ని రైతు వేదికలో నిర్వహించడంపై  కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  వెంటనే వేరే స్థలానికి మార్చాలని సూచించారు. చౌక ధర దుకాణంలో స్టాక్ రిజిస్టర్, స్టాక్ బోర్డు లేకపోవడం పట్ల సంబంధిత డీలర్ కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని  జిల్లా పౌరసరఫరాల అధికారిని ఆదేశించారు. అనంతరం సయ్యద్ పల్లి గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని, హరితహారం నర్సరీని జిల్లా కలెక్టర్ సందర్శించారు.  క్రీడా ప్రాంగణం, నర్సరీ నిర్వహణ బాగుందని  ప్రశంసించారు. తనిఖీ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ విమల, వికారాబాద్ తహసిల్దార్  వాహేదా ఖాతూన్, పరిగి తహసిల్దార్ రాంబాబు, ఎంపీడీవో శేషగిరి శర్మ, పౌరసరఫరాల శాఖ డీటీలు కార్తీక్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.