ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి

Published: Wednesday February 23, 2022
శ్రీరాంపూర్ ఏరియా ఆరోగ్య శాఖ అధికారి లోకనాథ్ రెడ్డి
నస్పూర్, ఫిబ్రవరి 22, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధవహించాలని శ్రీరాంపూర్ ఏరియా ఆరోగ్య శాఖ అధికారి లోకనాథ్ రెడ్డి సూచించారు. మంగళవారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిపై ఉద్యోగులకు ఆరోగ్యంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాంపూర్ జీఎం, డిప్యూటి సిఎంఓ ఆదేశాల మేరకు ఏరియా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని గనులు, డిపార్ట్ మెంట్ లపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగులు దీర్ఘ కాలిక వ్యాధుల నుండి రక్షణ పొందడానికి తమ యొక్క ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించినారు. ముఖ్యముగా దీర్ఘకాలిక వ్యాధులైన బి.పి, షుగర్, ఊబకాయము మొదలగు వాటినుండి తమను తాము రక్షించుకోవడానికి డాక్టర్ సూచించిన మందులు క్రమము తప్పకుండా వేసుకోవాలని కోరారు. అందువల్ల వ్యాధి యొక్క తీవ్రత తగ్గి ఎక్కువ కాలము జీవించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. బిపి, షుగర్, ఊబకాయము లాంటి వ్యాధులు వంశ పారంపర్యంగా కూడా వస్తాయని తెలిపారు. అందువలన ప్రతి వ్యక్తి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తమ యొక్క ఆహారపు అలవాట్లను తప్పకుండా మార్చుకోవాలని సూచించినారు. ఈ మధ్య కాలములో వయస్సు తో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారికి గుండె పోటు వస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరు ప్రతీ రోజూ ఒక గంట పాటు వ్యాయామము చేయాలని చెప్పారు. ప్రతీ ఉద్యోగి ఆరోగ్యమే మహా భాగ్యము అనే విధంగా నడుచుకొని వైద్యుల సూచన మేరకు క్రమము తప్పకుండా మందులు వాడుతూ ఆరోగ్యంగా జీవించాలని కోరినారు. సింగరేణి యాజమాన్యము ఉద్యోగుల ఆరోగ్యం పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుందని, అవసరమైన వారికి అత్యాధునిక చికిత్స కోసం కార్పోరేట్ ఆసుపత్రులకు కూడా రిఫర్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమములో ప్రాజెక్ట్ అధికారి వి.పురుషోత్తంరెడ్డి, మేనేజరు కె.జనార్ధన్, గుర్తింపు సంఘం కేంద్ర ఉపాధ్యక్షులు అన్నయ్య, మంద మల్లారెడ్డి, పిట్ సెక్రెటరీ పెంట శ్రీనివాస్, రక్షణాధికారి రమేష్, అధికారుల సంఘం గని ప్రతినిధి శ్యాంసుందర్ రావు, సంక్షేమ అధికారి బొంగోని శంకర్, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.