మల్లికార్జున దేవాలయంలో ప్రతి సోమవారం అన్నదానం

Published: Tuesday August 03, 2021
వికారాబాద్ బ్యూరో 02 ఆగస్ట్ ప్రజాపాలన : అన్ని దానాల కంటే అన్నదానం మహోత్కృష్ట కార్యక్రమమని వికారాబాద్ పట్టణ సిఐ రాజశేఖర్ కొనియాడారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మల్లికార్జున దేవాలయం ప్రాంగణంలో అన్నదానం కార్యక్రమాన్ని శ్రీ మల్లికార్జున సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ. కులమతాలకు అతీతంగా అన్నదానం కార్యక్రమాన్ని చేపట్టడం మల్లికార్జున సేవా సమితి సభ్యుల పూర్వ జన్మ సుకృతమని ప్రశంసించారు. ఆకలిగొన్న అన్నార్థుల కడుపు నింపడం సామాన్య విషయం కాదని పేర్కొన్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అన్నదానానికి ఆర్థికంగా సహకరించిన దాతలకు అభివందనాలని చెప్పారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీ మల్లికార్జున దేవాలయంలో మల్లికార్జున సేవా సమితి సభ్యులు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారని వివరించారు. అన్నదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే దాతలు 3 వేల 500 రూపాయలు సేవా సమితి సభ్యులకు అందజేస్తే పూర్తి ఏర్పాట్లు చేస్తారన్నారు. దాతలు తమకు తోచిన సహాయం చేసినా సేవా సమితి సభ్యులు తీసుకుంటారని తెలిపారు. సామాజిక సేవ చేసే ప్రతి దాత ముందుకు రావారని విజ్ఞప్తి చేశారు. అన్నదానంలో అన్నం, పప్పు, సాంబర్, పెరుగు, చట్నీ, పాపడ్, స్వీట్, కూల్ వాటర్ అందజేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున సేవా సమితి సభ్యులు వీరభద్ర కిరాణం షాపు మంచన శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ కుమార్, రవికుమార్, వెంకటేశం, పెండ్లిమడుగు గ్రామ సర్పంచ్ కెరెల్లి బుచ్చిరెడ్డి, అనిల్ కుమార్, భానుప్రకాశ్, గంగారం శ్రీను తదితరులు పాల్గొన్నారు.