భూ విక్రయం తరువాత చీటింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు

Published: Wednesday February 22, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 21 ఫిబ్రవరి ప్రజాపాలన :  జిల్లాలో చాలా మంది తమ పేరు మీద ఉన్న భూమిని అమ్ముకున్న  తర్వాత చీటింగ్ చేసే రైతుల పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి హెచ్చరించారు.  ధరణి వెబ్ సైట్ ద్వారా తిరిగి తమ పేరు మీదనే మీ సేవ ద్వారా మళ్లీ మళ్లీ  దరఖాస్తు చేసుకుంటున్నట్లు గ్రహించడం జరిగిందన్నారు. ఇలాంటి దరఖాస్తులను తిరస్కరిస్తున్నప్పటికీ మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవడం వలన కొన్నవారికి ఇబ్బందులు కలుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇలా చేయడం నేరమని అమ్ముకున్న భూమిని తిరిగి తమ పేరున చేసుకొనుటకు దరఖాస్తు చేసుకునే వారిపై చట్ట ప్రకారం చీటింగ్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.