పేదల్లో భరోసా నింపుతున్న సిఎం సహాయనిధి మేఘశ్రీ హాస్పిటల్స్ ప్రముఖ వైద్యులు టి పవన్ కుమార్

Published: Saturday January 28, 2023
బోనకల్, జనవరి 27 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మేఘశ్రీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మండల ప్రజలకు గత రెండు సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నామని మేఘ శ్రీ హాస్పిటల్స్ ప్రముఖ జనరల్ వైద్యులు టి పవనకుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మేఘ శ్రీ హాస్పిటల్స్ లో విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
బత్తినేని ఛారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో మండల కేంద్రంలో మేఘశ్రీ హాస్పిటల్స్ ను స్థాపించి రెండేళ్లుగా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. నేటి వరకు మేఘ శ్రీ హాస్పిటల్స్ లో వైద్య సేవలు పొంది అర్హులైన వారికి ఆర్ధిక భారాన్ని తగ్గించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తుకు బిల్లులను అందజేస్తూ పథకం పొందేలా సహకరిస్తున్నామని తెలియజేశారు. మేఘశ్రీ హాస్పిటల్స్ లో గత ఏడాది వైద్యసేవలు పొందిన వారికి బిల్లులు అందజేయగా ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సందడి వెంకటలక్ష్మీ, బోనకల్ గ్రామానికి చెందిన కళ్యాణపు సుగుణమ్మలకు సిఎం సహాయనిధి నుండి ఒక్కొరికి రూ. 45 వేలు జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు సిఫారసుతో, స్థానిక మాజీ జడ్పిటిసి బానోత్ కొండ సహకారంతో మంజూరయ్యాయన్నారు. నిరుపేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి(సిఎంఆర్ఎఫ్) భరోసా నింపుతుందని.. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు, వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి సిఎంఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం కొండంత ధైర్యాన్ని ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిఎం సహాయనిధి నుంచి మరిన్ని నిధులు వెచ్చిస్తూ దరఖాస్తు చేసుకున్నవారిలో అత్యధికమందిని ఆదుకుంటుందని పేర్కొన్నారు.. ఈ సమావేశంలో హాస్పిటల్స్ నిర్వాహకులు ఆకెన పవన్, సాధనపల్లి అమర్నాధ్, కుప్పల నిఖిల్, యంగల గిరి తదితరులు పాల్గొన్నారు.