బెల్లంపల్లిలో కరెంట్ కష్టాలు

Published: Thursday June 17, 2021
బెల్లంపల్లి, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : రెండవ గ్రేడ్ మున్సిపాలిటీ అయినా బెల్లంపల్లి పట్టణంలో కరెంటు కష్టాలు వర్ణనాతీతంగా  ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. బెల్లంపల్లి పట్టణం లోని విద్యుత్ శాఖ అధికారుల తీరుపై పట్టణ ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పినట్టు కనురెప్పపాటు కూడా కరెంట్ పోదు అనే మాటలను బెల్లంపల్లి పట్టణ విద్యుత్ శాఖ అధికారుల పనితీరు అపహాస్యం చేస్తున్నాయి, అధికారుల అలసత్వమో ప్రకృతి వైపరీత్యమో ఏమో తెలియదు గానీ పట్టణంలో వేళాపాళా లేకుండా కరెంటు తీసేస్తూ వ్యాపారస్తులకు ప్రభుత్వ, ప్రైవేటు, కార్యాలయాలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇదేమని అడిగితే లైన్ లో పనిచేస్తున్నారని, మెయింటెనెన్స్ ఉందని ఏదో ఒక సాకు చెప్పి రోజులో కనీసం పొద్దుట రెండు సాయంత్రం రెండు గంటలు కరెంటు తీసేస్తున్నారని ఇక  రాత్రి అయితే కొమ్మ ఊగితే చాలు కరెంటు పోతుంది వర్షం వచ్చినా రాకపోయినా కరెంటు రావడం కష్టమే అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని, రాత్రులు కరెంటు పోతే తెల్లవారేసరికి వచ్చేది నమ్మకం లేదని  ఫోన్లు చేసినా సంబంధిత అధికారులు స్పందించడం లేదని అంటున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో కరెంట్ బిల్లులు కట్టడం ఎందుకని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే అధికారికంగా కరెంట్ తీసేయడం ఆనవాయితీగా వస్తూంది ఆదివారం రోజుల్లో ప్రొద్దుట 9 గంటలకు నుండి  మధ్యాహ్నం 3 గంటల వరకు మెయింటినెన్స్ ఉందంటూ ప్రకటనలు చేసి ఎనిమిది గంటలకి తీసేస్తూ సాయంత్రం నాలుగైన విద్యుత్ రాకపోవడంతో వినియోగదారులు సిబ్బందిపై తీవ్ర వ్యతిరేకతను తెలుపుతున్నారు, ఏది ఏమైనా బెల్లంపల్లి పట్టణం లోని విద్యుత్ శాఖ అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవడంపై ఈ వ్యతిరేకత అంతా స్థానిక ప్రజా ప్రతినిధుల పనితీరుకు అద్దం పడుతుందనీ ప్రజలు ఆరోపిస్తున్నారు, ఇప్పటికైనా విద్యుత్ అధికారుల, ప్రజాప్రతినిధుల పనితీరులో మార్పు రాకపోతే ఈ వ్యతిరేకత ప్రభుత్వంపై పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజాపాలన ప్రతినిధి సహాయక ఇంజనీర్ను ఫోన్లో సంప్రదించ డానికి ప్రయత్నించగా స్పందించకపోవడం కొసమెరుపు.