ఐదు పంచాయతీలు తెలంగాణలో కలవడానికి తెరాస ఎంపీల ద్వారా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి

Published: Tuesday April 05, 2022
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సిపిఐ వినతిపత్రం సమర్పణ
భద్రాద్రి కొత్త గూడెం (ప్రజాపాలన ప్రతినిధి) : భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న 5 గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఉన్న తెరాస ఎంపీల ద్వారా పార్లమెంట్లో ఒత్తిడి తేవాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సిపిఐ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాష మాట్లాడుతూ అర్ధరాత్రి ఆర్డినెన్స్ ద్వారా ఏడు మండలాలు కేంద్రంలో ఉన్న భాజపా ప్రభుత్వం అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిందని అన్నారు. ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో విలీనమైతే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. అనంతరం స్పందించిన పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెరాస పార్లమెంటరీ పార్టీతో  ఇప్పటికే చర్చించానని ఐదు పంచాయతీ లు తెలంగాణలో కలిపే విధంగా భద్రాచలం అభివృద్ధికి కృషి చేస్తానని అందుకు కేంద్ర ప్రభుత్వంతో ఎంతటి పోరాటానికైనా సిద్ధమని తెలిపారు. ఈ వినతిపత్రం అందజేసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్. సీపీఐ నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు. రావులపల్లి రవికుమార్. అకోజు సునీల్ కుమార్. బల్లా సాయి కుమార్. రావులపల్లి పృద్వి. ఏ ఐ ఎస్ ఎఫ్ నాయకులు మారెడ్డి గణేష్ తదితరులు ఉన్నారు.