ముదిరాజ్ లను గ్రూపు డి నుండి గ్రూపు ఎ లోకి మార్చడమే లక్ష్యం

Published: Monday February 22, 2021

రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21 ( ప్రజాపాలన ) : ముదిరాజ్ లను గ్రూపు డి నుండి గ్రూపు ఎ లోకి మార్చాలనే లక్ష్యం ప్రతి ఒక్కరి ఆశయం కావాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపునిచ్చారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని కాసాని జ్ఞానేశ్వర్ ఫామ్ హౌజ్ లో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముదిరాజ్ గర్జన సభ ఏర్పాటుకు కోటి ముప్పై లక్షల ముదిరాజ్ బంధువులు హాజరయ్యారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరి హృదయంలో నేను ముదిరాజ్ నని స్వాభిమానం ఉప్పొంగాలని సూచించారు. ముదిరాజ్ ల ఆశయాలు, లక్ష్యాల సాధనకు సమైక్యంగా, సమన్వయంతో కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. జింఖానా గ్రౌండ్ కు ప్రతి నియోజకవర్గం నుండి వంద మందికి తగ్గకుండా కదలాలని వివరించారు. ముదిరాజులు సామూహిక గళమెత్తి తమ వాణిని ఘంటా పథంగా వినిపించాలని చెప్పారు. ప్రతి ఊరిలోని ముదిరాజ్ లను చైతన్యం చేయాలని కోరారు. గ్రామ వార్డు నుండి ఎంపి వరకు రాజకీయ పదవులలో కొనసాగేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ముదిరాజ్ లు పరస్పరం సహకార ధోరణితో రామదండులా పాదయాత్రలో పాల్గొనాలని అన్నారు. రాజకీయ పార్టీల కుటిల నీతిని ఎప్పటికప్పుడు ఎండగట్టాలని సూచించారు. ముదిరాజ్ ల ఐక్యతను దెబ్బతీసే విధానాలను తూర్పారబట్టాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకింటించిన జనాభాలో 20 శాతం ముదిరాజ్ లు ఉన్నారని గుర్తు చేశారు. హైదరాబాదు నగరంలో ముదిరాజ్ ల సభతో దద్దరిల్లేలా సభ జరుగనున్నదని చెప్పారు. మరో ప్రపంచం మాదిరిగా మరో ప్రభంజనాన్ని సృష్టించి చరిత్ర తిరగ రాయాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. జిఒ ఎంఎస్ సంఖ్య 15 ను అమలులోకి వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పై వత్తిడి చేస్తామని భరోసా కల్పించారు. ప్రభుత్వ పాలకులకు కనువిప్పు కలిగే విధంగా సభ జరుగనున్నదని తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ మత్స్య సహకార సంఘం డైరెక్టర్ చినంగి వెంకటేశం ముదిరాజ్, ముదిరాజ్ యువనాయకుడు  కాసాని వీరేష్ ముదిరాజ్, వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు గోవింద్ లక్ష్మణ్ రావు ముదిరాజ్, మహిళా ప్రధాన కార్యదర్శి సావిత్రి, కౌన్సిలర్లు కుమ్మర్పల్లి గోపాల్ ముదిరాజ్, ఆర్.నర్సిములు ముదిరాజ్, దుద్యాల లక్ష్మణ్ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు క్రిష్ణ ముదిరాజ్, రాష్ట్ర ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి అంబటి చంద్రయ్య తదితర ముదిరాజ్ బంధువులు పాల్గొన్నారు.