పిల్లల్లో కష్టపడే తత్వాన్ని పెంపొందించాలి * మధ్యాహ్న భోజన విషయంలో రాజీ వద్దు * టీచర్ గా పని చ

Published: Thursday March 02, 2023
వికారాబాద్ బ్యూరో 01 మార్చి ప్రజాపాలన :
పిల్లల్లో కష్టపడే తత్వాన్ని పెంపొందిస్తూ ఆత్మవిశ్వాసంతో పరీక్షల్లో ముందుకు వెళ్లేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. 
బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పదవ తరగతి పరీక్షల నిర్వహణ, ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల పెండింగ్ లపై షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి మల్లేశం,  విద్యాశాఖ అధికారి రేణుకా దేవి లతో కలిసి సహాయ సాంఘిక సంక్షేమ అధికారులు,  ఎంఈఓ లు ,  ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఏప్రిల్ మూడవ తేదీ నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు  రాష్ట్ర ప్రభుత్వం అభ్యాస దీపిక పుస్తకాలను  అందించి పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. విద్యార్థులకు  నాణ్యమైన విద్యను అందించడంలో ఎటువంటి రాజీ పడాల్సిన అవసరం లేదని , ఉపాధ్యాయులు అనుకుంటే పాఠశాలలో మార్పు తీసుకొచ్చే శక్తి మీకు ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాల పైన నమ్మకాన్ని పెంచే విధంగా ప్రతి పాఠశాలను ఆదర్శ పాఠశాలలు తీర్చిదిద్దేందుకు దిశగా ముందుకు వెళ్లాలని కలెక్టర్ సూచించారు.  పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తే గ్రామస్తులతోపాటు యువత సహకారం కూడా మీకు ఉంటుందని ఆయన తెలిపారు. ఉపాధ్యాయుల కృషి వల్ల పాఠశాల బాగుపడితే స్వయం సంతృప్తి చెందడంతో పాటు సమాజంలో తలెత్తుకొని ఎలా చేస్తుందని ఆయన అన్నారు.   ఉపాధ్యాయులు  నిర్లక్ష్యం వహిస్తే ఒక తరమే నష్టపోతుంది అనే విషయాన్ని గ్రహించి మెరుగైన, విలువలతో కూడిన విద్యను అందించాలని కలెక్టర్ సూచించారు.
* మధ్యాహ్న భోజన విషయంలో రాజీ వద్దు : 
మధ్యాహ్న భోజనం విషయంలో ఎటువంటి రాజీ లేకుండా ప్రభుత్వ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనంలో బియ్యం నాణ్యత లోపిస్తే వాటిని తిరిగి పంపాలని కలెక్టర్ తెలిపారు. 
* టీచరుగా పనిచేయడం అదృష్టం :
 పిల్లలకు జ్ఞానాన్ని అందించడంలో ఉపాధ్యాయుల ఆవశ్యకత ఎంతో ఉందని కలెక్టర్ తెలుపుతూ.. టీచరుగా పనిచేయడం అదృష్టంగా భావిస్తే ప్రధానోపాధ్యాయుడు గా చేయడం ఇంకా అదృష్టమని కలెక్టర్ అన్నారు. ప్రధానోపాధ్యాయులు నిబద్ధత,  కరాకండిగా పనిచేసినప్పుడు పాఠశాలలు అభివృద్ధి దిశగా వెళ్తాయని, ఉపాధ్యాయుల సహాయ సహకారాలతో పనిచేయాలని ఆయన సూచించారు. పరీక్షా సమయాల్లో అధికారుల మెప్పు కోసమో, ఇతరుల కోసమో కాపీయింగ్ చేయించినట్లయితే విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిన వారమవుతాని, అలాంటి వాటికి తాగవునీయకూడదని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. 
* ప్రీ మెట్రిక్,  పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లు పెండింగ్ వద్దు :
 జిల్లాలో పెండింగ్ లో ఉన్న  ప్రీ మెట్రిక్ , పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లపై ప్రత్యేక దృష్టి సారించి  వారం రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా మండల విద్యాధికారులు,  ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు.    విద్యార్థులకు  స్కాలర్షిప్స్  వారి అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. 
సమావేశం అనంతరం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి,  జిల్లా విద్యాధికారి,  మండల విద్యాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్  '' అభ్యాస దీపిక '' పుస్తకాన్ని ఆవిష్కరించారు.