గురువుల మాటలను స్ఫూర్తిగా తీసుకోవాలి గుమ్మా నరేష్ ను అభినందించిన హీరో సుమన్..

Published: Tuesday December 06, 2022
తల్లాడ, డిసెంబర్ 5 (ప్రజాపాలన న్యూస్):
ప్రస్తుతం పోటీ ప్రపంచంలో మనుషులకు స్వార్థం పెరిగిపోయిందని, ఇటువంటి తరుణంలో లేని వ్యక్తుల కోసం కూడా సేవా కార్యక్రమాలు చేపట్టటం ఎంతో గొప్ప విషయమని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. ఆదివారం రాత్రి తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్లో దాసరి నారాయణరావు, పద్మ దంపతుల జ్ఞాపకార్థం నిర్మించిన కళానిలయాన్ని ఆయన చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ ప్రస్తుతం పనికోసం మాత్రమే ప్రజలు నమ్మకంగా ఉంటారని, తర్వాత పట్టించుకోరని ఇలాంటి సమయంలో ఆ వ్యక్తులు లేకపోయినా సేవా కార్యక్రమాలు చేపట్టటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు సాంస్కృతిక సామాఖ్య అధ్యక్షులు గుమ్మా నరేష్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలు తమ తల్లిదండ్రులు, గురువులు చెప్పిన విధంగా నడుచుకోవాలని సూచించారు. తన గురువులు రేలంగి నరసింహారావు, దాసరి నారాయణరావు ఎంతో ప్రోత్సహించారని, వారి ద్వారానే ఈ స్థాయిలో ఉన్నానని గుర్తుచేశారు. తాను సినీ రంగంలో రావడానికి ముఖ్య కారణం భాను చందరే అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత, ఎంఈఓ దామోదర్ ప్రసాద్, ఎంపీటీసీ గోవిందు విజయమ్మ, ధారా విష్ణు మోహన్ రావు, కొమ్మినేని వెంకటేశ్వరరావు, తుమ్మలపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.