వనం నుండి జనంలోకి ,అశేష జన సందోహం నడుమ వనదేవత రాక.

Published: Friday March 05, 2021

- పగిడిద్దరాజు జాతరకు హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా.పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం.
- పగిడిద్దరాజు జాతరను మేడారం జాతరలో అభివృద్ధి చేయాలి: ములుగు ఎమ్మెల్యే సీతక్క.
- వచ్చే జాతర నాటికి అన్ని వసతులు అందుబాటులోకి వచ్చే విధంగా చూస్తా, ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల, మార్చి 04, ప్రజాపాలన: ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం, అరెం వంశీయుల ఇలవేల్పు, శ్రీ మేడారం సమ్మక్క భర్త పగిడిద్దరాజు జాతర మండలంలోని యాపలగడ్డ గ్రామ సమీపంలోని తొట్టివాగు ఒడ్డున అత్యంత ఘనంగా జరుగుతుంది. బుధవారం జాతర ప్రారంభమైనప్పటికీ రెండో రోజైన గురువారం వనదేవత అశేష జన సందోహం నడుమ వనదేవత జనంలోకి వచ్చింది.కిలోమీటరు మేర కిక్కిరిసిన జనాభాతో ఇల్లందు, గుండాల ప్రధాన రహదారి నిండిపోయింది. ఆదివాసి గిరిజనుల సాంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలతో వడ్డెలు పూజారుల పూనకాలతో జాతర ఉర్రూతలూగించింది. పగిడిద్దరాజు సమ్మక్క వనదేవతలను చూసేందుకు భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. బుధవారం పగిడిద్దరాజును కొడవటంచ సమీపంలోని బర్లగుట్ట నుండి తీసుకువచ్చిన విషయం తెలిసిందే! కాగా గురువారం వన దేవతను యాపలగడ్డ, పోతిరెడ్డిగూడెం మద్య గల చిలకలగట్టు (మాడిమోర్) గుట్ట నుండి తీసువచ్చారు. కాగా జాతర సజావుగా సాగేందుకు డాక్టర్ రవిచంద్ ఆధ్వర్యంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.గుండాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తాగునీరు అందిస్తున్నారు. తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ వెంకట్రావు, పర్యవేక్షణతో పాటు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతరకు రావడం, దేవతలకు మొక్కులు చెల్లించుకోవడంతో ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. ప్రజలతో కలిసి సీతక్క, రేగా కాంతారావు చేసిన నృత్యాలు అలరించాయి. సీఐ చెన్నూరి శ్రీనివాస్, ఎస్ఐ ముత్యం రమేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
-పగిడిద్దరాజు జాతరను మేడారం తరహాలో అభివృద్ధి చేయాలి.
-ములుగు ఎమ్మెల్యే సీతక్క. పగిడిద్దరాజు జాతరను మేడారం తరహాలో అభివృద్ధి చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆసియాలోనే అతిపెద్ద జాతరైన శ్రీ మేడారం సమ్మక్క జాతర తర్వాత ఆమె భర్త పగిడిద్దరాజు జాతర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గుండాల మండలంలో గల యాపలగడ్డ గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతుందని ఈ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, అందుకు భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎవరి కోసమో జాతర విధివిధానాలను మార్పులు చేర్పులు చేయకుండా ఆదివాసీ, గిరిజన సాంప్రదాయ పద్దతిలోనే జరుపుకోవాలని సూచించారు. సీతక్క వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మామకన్ను సర్పంచ్ కొడెం ముత్యమాచారి, మండల కార్యదర్శి  ఈసం పాపారావు, సాయనపల్లి ఎంపీటీసీ కల్తి క్రిష్ణారావు, పడుగోనిగూడెం సర్పంచ్ కొటెం జయసుధ, శోభన్ బాబు, మండల యువజన నాయకులు దుర్గా, మండల నాయకులు రమేష్, మైనార్టీ నాయకులు ఎస్కే సాహెబ్ తదితరులు ఉన్నారు.
-వచ్చే జాతర నాటికి అన్ని వసతులు అందుబాటులోకి వచ్చే విధంగా చూస్తా.
-ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు. పగిడిద్దరాజు జాతర నిర్వహకులు, అరెం వంశీయులు అప్పయ్య, ఇద్దయ్య, లచ్చుపటేల్, కాంతారావు, బుచ్చయ్య, సత్యం, రామారావు, బసవయ్య, సమ్మయ్య లు జాతరలోని మౌళిక వసతుల కల్పన గురించి రేగా కాంతారావు కు విన్నవించగా అందుకు రేగా వచ్చే జాతర నాటికి గర్భగుడి నిర్మాణంతో పాటు తాగునీరు తదితర మౌలిక వసతులను ప్రభుత్వ పరంగా గాని, రేగా విష్ణు మెమోరియల్ ట్రస్టు ద్వారా గాని అందుబాటులోకి తెచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు.రేగా వెంట టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మోకాళ్ళ వీరస్వామి, ముత్తాపురం సర్పంచు పూనెం సమ్మయ్య, మండల యువజన నాయకులు సయ్యద్ అజ్జు తదితరులు ఉన్నారు.