ఈ నెల 31వ తేదీ లోగా సి.ఎం.ఆర్. ప్రక్రియ పూర్తి చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ న

Published: Thursday January 05, 2023
మంచిర్యాల బ్యూరో,  జనవరి 4, ప్రజాపాలన:
 
జిల్లాలోని ఎఫ్.సి.ఐ., పౌరసరఫరాలకు సంబంధించిన సి.ఎం.ఆర్. ప్రక్రియను ఈ నెల 31వ తేదీ లోగా పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్ లో మంచిర్యాల రాజస్వ మండల అధికారి వేణు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్కుమార్తో కలిసి రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ 2022-23 వడ్ల దిగుమతి, గత సీజన్లో బాకీ ఉన్న సి.ఎం.ఆర్. బియ్యం సంబంధిత పనులను త్వరగా పూర్తి చేయాలని, ఖరీఫ్, రబీ 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఎఫ్.సి.ఐ., పౌర సరఫరాల శాఖకు సంబంధించి సి.ఎం.ఆర్. ప్రక్రియను ఈ నెల 31వ తేదీ లోగా పూర్తి చేయాలని తెలిపారు. వానాకాలం 2022-23కు సంబంధించి రైసిమిల్లులలో దిగుమతి చేసుకున్న ధాన్యం బస్తాలను లెక్కించేందుకు వీలుగా మిల్లులో క్రమపద్ధతిలో అమర్చాలని, సంబంధిత రిజిస్టర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న రైస్ మిల్లులను ఈ నెల 14వ తేదీ నుండి తనిఖీలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి మిల్లులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ నెల 10వ తేదీన చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్లుల సంఘం అధ్యక్షులు నల్మాసు కాంతయ్య, రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు తదితరులు
పాల్గొన్నారు.