కుమ్మరుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం... 26న ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష

Published: Friday August 20, 2021
దీక్ష విజయవంతం కోసం వాల్ పోస్టర్ విడుదల
హాజరైన కుంభకార్ మహాసభ ప్రతినిధులు
మేడిపల్లి, ఆగస్టు19 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో కుమ్మరుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 26వ తేదీన కుమ్మరుల నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టింది. అఖిల భారతీయ కుమ్మర ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరుగనున్న కుమ్మర్ల నిరసన దీక్షలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కుమ్మరి కులస్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని గురువారం ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆవరణలో రూపొందించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. కుంభకర్ణ మహా సంఘం రాష్ట్ర యువజన సిలివేరు శంకర్ ప్రజాపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మిరుదొడ్డి శివానంద్ ప్రజాపతి, రాష్ట్ర కోశాధికారి దొమ్మాట నాదం, కార్యనిర్వాహక కార్యదర్శి కే.శివశంకర్, యువజన విభాగం సంయుక్త కార్యదర్శి వర్కల బాల్రాజ్, ప్రతినిధులు కొలిచెలిమి కృష్ణ, కట్కూరి లింగస్వామి, గుమ్మడవెల్లి యాదయ్య, ఏదునూరి పోచయ్య, శనిగరం జగదీశ్వర్, నిమ్మనగోటి యాదగిరి, దేవరుప్పుల జంగయ్య, జాగిల్ల పురం కృష్ణకుమార్, నాగయ్య పల్లి మల్లేష్, బొమ్మరపు నరసింహ, కొక్కండ రాజు పాల్గొని ప్రసంగించారు. ఆధునిక కుండల తయారీ కోసం రాష్ట్ర ప్రభుత్వ ద్వారా శిక్షణ పొందిన 320 మందిలో 160కు పైగా వృత్తిదారులకు బ్యాంకు రుణాల కోసం లబ్ధిదారుల ఒక్కొక్కరి నుంచి వ్యక్తిగతంగా 20 వేల చొప్పున కుమ్మరి ఫెడరేషన్ పేరున తీసుకున్నారని పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా రుణాలు ఇవ్వకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం బ్యాంకు రుణాలు ఇవ్వాలని, ఇతర చేతివృత్తుల మాదిరిగానే కుమ్మర వృత్తిదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు ప్రకటించి, అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ భగాయత్ లో కుమ్మర ఆత్మగౌరవ భవనం కొరకు ప్రకటించిన "3 ఎకరాల స్థలంలో 3 కోట్లతో భవనం" నిర్మాణం వెంటనే చేపట్టాలని, కుమ్మర్లను ఎంబీసీలుగా గుర్తించి, కుమ్మర బంధు ప్రకటించాలని, కుండల తయారీ కోసం ప్రభుత్వ భూములను ఉచితంగా వినియోగించుకోవడానికి జారీచేసిన 1076 జీవో ను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఎలాంటి ఫీజు చెల్లించకుండా గ్రామాల్లోని చెరువులో నుంచి బంకమట్టిని తీసుకోవడానికి 1996లో జారీ చేసిన జీవో నెంబర్ 12 పునరుద్ధరించాలని, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో వంట చెరకుగా పనికివచ్చే వృక్షాలను పెంచుకుని కుండల తయారీ కోసం ఆములలో ఉపయోగించడానికి అనుమతి ఇస్తూ 1996లో జారీ చేసిన జీవో నెంబర్ 274 ను పునరుద్ధరించాలని, అన్ని మార్కెట్ యార్డులు షాపింగ్ కాంప్లెక్స్లో కుమ్మరులకు షాపులను కేటాయించి నామమాత్రపు ఫీజు మాత్రమే తీసుకోవాలని జారీ చేసిన జీవో నెంబర్ 20ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో 5 ఎకరాల స్థలం కేటాయించి ప్రాచీన అత్యాధునిక పరికరాలతో శిక్షణ ఉపాధి కల్పించే విధంగా పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కుమ్మర వృత్తిదారులకు ఈఎస్ఐ ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, 50 సంవత్సరాలు పైబడిన వృత్తిదారులకు ప్రత్యేక ఫైనాన్స్ విధానాన్ని ఏర్పాటు చేయాలని, గ్రామదేవతల ఆలయాలలో కుమ్మరులను పూజారులుగా నియమించాలని చెప్పారు.  కుమ్మరి శాలివాహన ఫెడరేషన్ కు కేటాయించిన నిధుల నుంచి సబ్సిడీ శాతాన్ని పెంచి నేరుగా కుమ్మరి సొసైటీలకు రుణాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. పై న్యాయమైన డిమాండ్ల హక్కుల సాధన కోసం నిర్వహించిన తలపెట్టిన నిరసన దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.