ఫీ రియంబర్స్ కొరకు రోడెక్కిన యస్ఏపి కళాశాల విద్యార్థులు

Published: Tuesday November 29, 2022

వికారాబాద్ బ్యూరో 28 నవంబర్ ప్రజాపాలన : ఫీ రియంబర్స్ మెంట్, ఉపకార వేతనాలు మంజూరు చేయాలని యస్ఏపి ( శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ) కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని యస్ఏపి కళాశాల ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ నుండి తాండూరుకు వస్తున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని ప్రధాన రోడ్డుపై అటకాయించారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్, విద్యాశాఖ మంత్రి డౌన్ డౌన్ అను నినాదాలతో ప్రధాన రోడ్డంతా దద్దరిల్లింది. వెంటనే స్పందించిన తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో ఫోన్ లో మాట్లాడి విద్యార్థులు ఫీ రియంబర్స్ మెంటు, స్కాలర్ షిప్స్ గురించి ఆందోళన చేస్తున్నారని చెప్పారు. రూ. 11000 నుంచి 21 వేల వరకు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.