ధరణిలో స్లాట్ బుకింగ్ చేసుకున్న వాటిని వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ పౌసుమి బసు

Published: Thursday April 01, 2021

వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 31 ( ప్రజాపాలన ) : ధరణి క్రింద స్లాట్ బుకింగ్ చేసుకొన్న తర్వాత జిల్లాలో ఇప్పటి వరకు దరఖాస్తులు వివిధ కారణాల వల్ల తహసీల్దార్ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్ డి ఓ లు, తహసీల్దార్లతో మాట్లాడుతూ అపరిష్కృతంగా ఉన్న ధరణి పనులను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఆధార్ సీడింగ్, ఇతర తప్పులను సరిచేసుకునేటట్లు వచ్చిన దరఖాస్తులను రిజెక్ట్ చేసి సరి చేసుకున్న పిదప మళ్ళీ స్లాట్ బుకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకొనే విధంగా చూడాలని సూచించారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేసేటప్పుడు ధరణిలో అమ్ముకొన్న వారి పేర్లు తొలగించి, కొనుకున్న వారి పేర్లు వెంటనే నమోదు చేయాలని తహసీల్దార్ లను సూచించారు. ఆర్ డి ఓ లు ఇట్టి పనులను పరిశీలిస్తూ ఉండాలని కోరారు. జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందున ఎక్కువ మంది ఒకే దగ్గర గుమిగూడకుండా డిస్టెన్స్లో కూర్చోబెట్టాలని నిబంధనలు పాటించాలని తెలిపారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున కార్యాలయానికి వివిధ పనులకు వచ్చే వారికి త్రాగు నీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, సెక్షన్ తహసీల్దార్లు శ్రీధర్, అనురాధ, నర్సింహా, ఆర్ డి ఓ లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.