అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- డాక్టర్ కిషోర్ తాల్క

Published: Tuesday July 12, 2022
హైదరాబాద్ 11 జులై ప్రజాపాలన :  గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దేవరుప్పల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్య అధికారి డా.కిషోర్ కుమార్ తాల్క తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రజాపాలన తో మాట్లాడుతూ ప్రస్తుతం
విరామం లేకుండా కురుస్తున్న వానలతో  వివిధ రకాల అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త గా తగు చర్యలు తీసుకోవాలని ప్రజలను మీడియా ద్వారా కోరడం జరిగింది. వర్షాకాలం  నీరు నిల్వ ఉండి ,దోమలు, ఈగలు చేరుతాయి. వీటి వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. ప్రజలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.  ఈ సమయంలో చిన్న పిల్లలు, గర్భినీ స్త్రీలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గర్భిని స్త్రీలకు అత్యవసర వైద్య సహాయం  వారి ఇంటి వద్దకే ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, వైద్యులు వచ్చి వైద్య సహాయం అందిస్తారని తెలియజేశారు. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు  లాంటివి ఉన్నవారు వెంటనే ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది   ఆందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. అత్యవసర సేవలకు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. వర్షాకాలం లో త్రాగు నీరు కలుషితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి  కాచి వడబోసిన నీటిని తాగడం మంచిదని సూచించారు. 
గ్రామాల్లో త్రాగు నీటి ట్యాంకులను పదిహేను రోజుకు ఒకసారైనా సిబ్బంది చేత శుభ్ర పరచాలని సూచించారు. నిత్యం తగు మోతాదులో తాగు నీటి ట్యాంకులలో  క్లోరినేషన్ చేయాలని సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శుల ను కోరారు. ఆశా వర్కర్లు ఆరోగ్య సిబ్బంది తగు మోతాదులో క్లోరినేషన్ జరుగుతున్న విషయాన్ని నిత్యం గమనించాలని సూచించారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని  ఈ సందర్భంగా సూచించారు.వివిధ గ్రామాల సర్చంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసి, ప్రజాప్రతినిధులు, నాయకులు మండల స్థాయి అధికారులు ప్రజలు సిబ్బంది ఈ  విషయం లో సహకరించాలని ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా  కోరడం జరిగిందన్నారు.