ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం * ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్

Published: Saturday November 26, 2022
వికారాబాద్ బ్యూరో 25 నవంబర్ ప్రజాపాలన : ఈనెల 26, 27, డిసెంబర్ 3 ,4 తేదీలలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమము నిర్వహించాలని ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు టెలి కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా  ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీలలో  నిర్వహించే ప్రత్యేక క్యాంపేయిన్ లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి బూతు స్థాయి అధికారి సంబంధిత పోలింగ్ కేంద్రానికి ఉదయం 10 గంటలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. 2023 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి  యువతీ, యువకులను గుర్తించి  ఫారం -6 ద్వారా ఓటరు గా నమోదు చేయాలని ఇందుకు గాను బిఏల్ఓ లు ఇంటింటికి తిరిగి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించాలని ఆదేశించారు. అదేవిధంగా  ట్రాన్స్ జెండర్స్ ను గుర్తించి వారిని సైతం ఓటరు జాబితాలో నమోదు చేయాలని పేర్కొన్నారు. అంగవైకల్యం ఉన్న ఓటర్లను గుర్తించి సదరం డేటా ద్వారా వారిని ఓటర్ జాబితాలో నమోదు చేయాలన్నారు.  ఇంతకు ముందు జాబితాలో ఉన్న వారిని, కొత్తగా నమోదు అయిన వారిని సైతం మ్యాపింగ్ చేయాలని తెలిపారు. ఓటరు జాబితాలో ప్రముఖుల పేర్లు తప్పిపోకుండా చూసుకోవాలని , ఒకవేళ లేనట్లయితే వారి పేర్లు నమోదు చేయాలని తెలిపారు.  ఫామ్ -6 ద్వారా ఓటర్ నమోదు, 6-ఆ ద్వారా ఆధార్ లింక్, ఫామ్ -7 ద్వారా చనిపోయిన వారిని తొలగించడం, ఫామ్ - 8 ద్వారా చిరునామా బదిలీ తదితర మార్పులు చేపట్టెందుకు ఫారాలు, బ్యానర్ తన వెంట పోలింగ్ స్టేషన్ వద్ద అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు.   ప్రతి సూపర్వైజర్ వారి పరిధిలో గల  పోలింగ్ కేంద్రాలను సందర్శించి  ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, అలాగే ఈఆర్ఓ  వారి పరిధిలో ఉన్న  10 పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని అంశాలను పరిశీలించి అర్హత ఉన్న వారందరూ ఓటరు జాబితాలో నమోదైనది, లేనిది పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారికి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇట్టి పనులలో బిఎల్ ఓ లు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే  పనులకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిఖిలతో పాటు వికారాబాద్ ఆర్డిఓ విజయకుమారి, తాసిల్దార్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.