దేశ సమైక్యత కోసమే రాహుల్ భారత్ జోడో పాదయాత్ర

Published: Thursday October 27, 2022

మధిర రూరల్ అక్టోబర్ 26 (ప్రజా పాలన ప్రతినిధి) దేశ సమైక్యతను కాపాడటం కోసమే కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర చేపట్టినట్లు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా పేర్కొన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ జూడో పాదయాత్రకు సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 30న హైదరాబాదుకు రాహుల్ పాదయాత్ర చేరుకుంటుందన్నారు. సీఎల్పీ లీడర్ మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తుందన్నారు రైతులను ఉద్యోగులను కార్మికులను వ్యాపారులను ఇలా ప్రతి వర్గాన్ని పీడిస్తుందన్నారు. దేశ సంపదన ఒకరిద్దరు బడా బాబులకు దోచిపెడుతుందని ఆయన విమర్శించారు బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై ఈడి సీబీఐ దాడులతో వేధిస్తుందన్నారు. ఇటువంటి వేధింపులకు కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష నాయకులు ఎవరూ భయపడరన్నారు. లౌకిక భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ గతంలో పాలన చేసిందన్నారు. ప్రస్తుత మోడీ పాలనలో రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజలపై అదనపు భారం మోపిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు పారుపల్లి విజయకుమార్  షేక్ జహంగీర్ మాగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.