వికారాబాద్ ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల

Published: Wednesday January 12, 2022
వికారాబాద్ బ్యూరో 11 జనవరి ప్రజా పాలన : ముళ్లకంచెగా మారిన వికారాబాద్ ఎమ్మార్వో పదవి. ఎప్పుడు ఏ అధికారి వస్తాడో అతను ఎంత కాలము ఈ పదవిలో కొనసాగుతాడో కూడా తెలియని దుస్థితి. వచ్చిన అధికారి రాజకీయ ఒత్తిళ్ళు తట్టుకొని ధైర్యంగా పని చేసే అధికారి కోసం వికారాబాద్ మండల ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాజకీయ ప్రతినిధుల మాటలు శాసనాలుగా భావించక పోతే వెంటనే ఆయనపై బదిలీ వేటు పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రం అగుటవలన చుట్టుపక్కల గ్రామాల భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రముఖ రాజకీయ ప్రముఖుల డేగ కళ్ళన్నీ వికారాబాద్ ఎమ్మార్వో పదవి పైనే పడుతున్నాయని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఏ అధికారి వచ్చినా అడుగులకు మడుగులు వత్తే ఎమ్మార్వో ఉంటేనే పదవిలో కొనసాగుతారని వికారాబాద్ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ ఎమ్మార్వో గా విధులు చేపట్టిన బి కృష్ణయ్య వచ్చి మూడు నెలలు కూడా కాకుండానే బదిలీ వేటు పడిందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం వికారాబాద్ ఎమ్మార్వో గా బాధ్యతలు చేపట్టిన షర్మిలను సక్రమంగా తన విధులను నిర్వహించ కలిగేటట్లు చేస్తారా లేదా అనే విషయం కాలమే నిర్ణయించాలి. నూతన ఎమ్మార్వో గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల తన విధులకు ఆటంకం కలిగించరని ఆశిద్దాం. వికారాబాద్ ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన బి కృష్ణయ్యను మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలానికి ఎమ్మార్వో గా బదిలీ చేశారు.