తల్లిదండ్రులను వేధిస్తే జైలుకే

Published: Wednesday June 02, 2021

అడ్వకేట్ రాజలింగు మోతె
మంచిర్యల జిల్లా, జూన్01, ప్రజాపాలన ప్రతినిధి : తల్లిదండ్రులను వేధించినా, వృద్యాప్యంలో వారిని పట్టించుకోకుండా వ్యవహారిస్తే జైలు ఊచలు లెక్కించడం కాయం అని న్యాయవాది, సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు రాజలింగు మోతె పేర్కొన్నారు. తల్లిదండ్రుల దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రజాపాలనతో ఆయన మాట్లాడారు. తమ పిల్లలు ఉన్నతంగా జీవించాలనే ఉద్దేశ్యంతో రెక్కలు ముక్కలు చేసుకుని, పిల్లల చదువు, అభివృద్ధి, వివాహం మొదలైన వాటికోసం వారి జీవితాన్నే త్యాగం చేస్తున్నారని అన్నారు. ఇంత త్యాగం చేసి, తీరా వృధ్యాపం వచ్చేసరి కి వారి పిల్లలు వారిని పట్టించుకోక పోవడం వల్ల వారు దుర్భర జీవితం గడుపుతున్నారని అన్నారు. కొందరు అనాధ వృద్ధాశ్రమాలకు పంపిస్తున్నారని అన్నారు. నిల్వ నీడ లేకుండా రోడ్డుపాలు చేస్తున్న కొడుకులు కూడా ఉన్నారన్నారు. వయోవృద్ధుల సంరక్షణ, పోషణ బాధ్యత విషయం లో ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. 57 సంవత్సరాలు దాటిన వారు సీనియర్ సిటిజన్ గా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు., 2007 చట్టానికి చేసిన సవరణ ప్రకారం కొడుకులు మాత్రమే కాకుండా కూతుళ్ళు, అల్లుళ్లు, కోడళ్లు, మైనారిటీ తీరిన మనుమలు, మనుమరాళ్లు కూడా వారి బాధ్యత స్వీకరించాల్సి ఉంటుందన్నారు. వారికి ఆహరం, దుస్తులు, నివాసం, మందుల ఖర్చులు భరించడం చేయాలన్నారు. లేని పక్షంలో రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వయోవృద్ధుల పిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లలో ఏఎస్ఐ స్థాయి ఆఫీసర్ ని ప్రత్యేక అధికారిగా నియమించారని అన్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, వారి పట్ల అనుచితంగా ప్రవర్తించినా వారికి 6 నెలల నుంచి గరిష్టంగా 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉందన్నారు. ఆలనా పాలనా చూసుకునే వారు లేని వయోవృద్ధుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వ మే తీసు కోవాలన్నారు.