కెరెల్లికి క్రీడా ప్రాంగణాన్ని కేటాయించండి

Published: Saturday June 04, 2022
సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి
 
వికారాబాద్ బ్యూరో 03 జూన్ ప్రజాపాలన : గ్రామీణ ప్రాంత యువత శారీరకంగా దృఢంగా, చురుకుగా, ఆరోగ్యవంతంగా ఉంటారని కెరెల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని కెరెల్లి గ్రామానికి కేటాయిస్తే యువత క్రీడలలో నైపుణ్యతో పాటు విజయాన్ని సాధిస్తారని ఆకాంక్షించారు. శుక్రవారం ధారూర్ మండల పరిధిలోని కెరెల్లి గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కొత్తపల్లి నర్సింహారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రేవన్ గౌడ్, ప్రత్యేక అధికారి వెంకటేష్ లతో కలిసి గల్లీ గల్లీ తిరిగి ప్రజలకు పారిశుద్ధ్యం గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో పాత ఇనుప స్థంభాలను తొలగించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. మూడు పాడుబడ్డ ఇండ్లను కూల్చడానికి ఇంటి యజమానులకు జిపి నుండి నోటీసులు పంపిస్తామని స్పష్టం చేశారు. వాడుకలో లేని చేతిపంపులను పూర్తిగా మూసి వేయవలసి ఉంటుందని వివరించారు. గ్రామంలో రెండు మ్యాన్హోల్స్ ను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కొరకు ఎన్నిక కాబడినదని తెలిపారు. కెరెల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా రూపాంతరము చెందాలంటే తెలంగాణ క్రీడా ప్రాంగణం ప్రభుత్వం మంజూరు చేస్తే సంపూర్ణ ఆదర్శ గ్రామంగా పరిఢవిల్లుతుందని అభిలషించారు. ఆదర్శ గ్రామంగా మారుటకు క్రీడాప్రాంగణం ఒక్కటే వెలితిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
కెరెల్లిలో ప్రభుత్వ భూమి ఉన్నా కూడా రెవిన్యూ శాఖ ఆట స్థలం కోసం స్థలాన్ని కేటాయించకపోవడం విడ్డురంగా ఉందన్నారు. గ్రామానికి అనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చూపిస్తే తాము తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. గ్రామంలోని యువత ఆటలు ఆడేందుకు ఇతర గ్రామాలకు వెళ్లే పరిస్థితి వచ్చిందని, వెంటనే స్థలాన్ని చూపించి గ్రామీణ యువతను ప్రోత్సహించాలని కోరారు. యువత చెడుదారి పట్టకుండా క్రీడల పట్ల ఆసక్తిని కలిగించేటట్లు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మండల అధ్యక్షురాలు అమృత అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఏఎన్ఎంలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.