నేడు జరిగే సిపిఐ మండల మహాసభలను జయప్రదం చేయండి సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు

Published: Friday July 22, 2022

బోనకల్, జులై 21 ప్రజాపాలన ప్రతినిధి : నేడు జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ మండల 15వ మహాసభ చింతపట్ల గోపయ్య నగర్ (రాపల్లి గ్రామం) లో జరుగుతున్నాయి. ఈ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి యంగల ఆనందరావు పిలుపునిచ్చారు. మండలంలోని సీపీఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గల మెత్తిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన గ్రామం రాపల్లి గ్రామం ఒకటన్నారు. కమ్యూనిస్టు ఉద్యమానికి మొదటి నుండి బాసటగా నిలిచిన ప్రాంతమని, కమ్యూనిస్టు యోధులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు లాంటి మహనీయులు నడయాడిన ప్రాంతమని కొనియాడారు. ఎన్నో ఉద్యమాలకు కేంద్రమైన ఈ గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భూ పోరాటాలు సర్వే నెంబర్ 144, 440లలో ఎందరో పేద ప్రజలకు భూమిని పంచి పెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుత పాలకులు ప్రజా సంక్షేమం కోసం కాకుండా కార్పొరేటర్ సంస్థల కోసం పనిచేస్తున్నారన్నది అక్షర సత్యమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన విమానయానం, రైల్వేలు, నౌకాశ్రయాలు చివరకు రోడ్ల తో సహా కార్పొరేట్ శక్తులకు అమ్మేస్తున్నారని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం పాటుపడతానని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ పేదల గురించి ఒక నిమిషం కూడా ఆలోచించకుండా అనునిత్యం కార్పొరేట్ సంస్థల మెప్పు కోసం పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని సంక్షోభాన్ని ప్రజలకు తెలియకుండా ఉండడానికి మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ 2018 లో ఇచ్చిన ఎన్నికల హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో పేదరికం, నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతున్నాయని, ఈ తరుణంలోనే దేశానికి కమ్యూనిస్టుల అవసరం ఉన్నదని , భారత కమ్యూనిస్టు పార్టీ 15వ మండల మహాసభను జూలై 22న శుక్రవారం రోజున చింతపట్ల గోపయ్య ప్రాంగణం (రాపల్లి) గ్రామంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ మండల మహాసభలో రాష్ట్ర , జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు శాఖ కార్యదర్శులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.