ఈ నెల 10న ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముట్టడిని జయప్రదం చెయ్యండి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యు

Published: Friday October 07, 2022
బోనకల్, అక్టోబర్ 6 ప్రజా పాలన ప్రతినిధి: అధికారానికి వంత కొడుతూ, నిపక్షపాతంగా ఉండాల్సిన పోలీసులు ఏకపక్షంగా ఉండటాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ( సిపిఐ) ఆధ్వర్యంలో ఈ నెల 10 న ఖమ్మం రూరల్ మండలం పోలీస్ స్టేషన్ ని ముట్టడించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు వెల్లడించారు. మండల కేంద్రంలో గురువారం మండల కార్యదర్శి వెంగల ఆనందరావు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖమ్మం రూరల్ మండల సిఐ పని విధానం ఏకపక్షంగా ఉందన్నారు. ఎవరైనా ఎవరిమీదైనా ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఫిర్యాదును స్వీకరించాల్సిన బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్( యస్ హెచ్ ఓ ) మీద ఉందన్నారు. ఫిర్యాదు స్వీకరించిన తర్వాత ఆ ఫిర్యాదులోని సత్య అసత్యాలను విచారించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ ఐ ఆర్) ను ఇచ్చేందుకే పోలీసులు ఉన్నారని ఆయన తెలియజేశారు. భారతదేశ పోలీసింగ్ విధానం ప్రకారం దేశ ప్రధానమంత్రి ఇచ్చిన ఫిర్యాదునైనా సరే విచారించి ఎఫ్ఐఆర్ చేయాల్సిన బాధ్యత/ విధి కేవలం స్టేషన్ హౌస్ ఆఫీసర్ (యస్ హెచ్ ఓ) కూ మాత్రమే ఉందన్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ( సిఆర్ పిసి) 1973 ప్రకారం ఎవరిమీదైనా ఫిర్యాదు చేయవచ్చునని ఆ ఫిర్యాదులోని సత్యాఅసత్యాలను విచారించిన ప్రధప సెక్షన్ 154, 155 ల ప్రకారం ఎఫ్ఐఆర్ చేయాలా వద్దా అనేది స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు పూర్తి అధికారం ఉందన్నారు. కానీ ఖమ్మం రూరల్ మండలంలోని ప్రజలు, కొంతమంది నాయకులు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఫిర్యాదు చేయటానికి ఎందుకు వచ్చారని అక్కడి ఎస్ హెచ్ ఓ వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన వాపోయారు. గ్రామాల్లో జరిగిన గొడవలకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు తమ్మినేని కృష్ణయ్య కూడా ఇలా తరచుగా వచ్చి ఫిర్యాదు చేశాడని, ఆయన గతి మీకు కూడా పడుతుందని హెచ్చరించడం నేరపూరితమైన చర్యగా భావించాలన్నారు. బాధలు కలిగినప్పుడు, అవమానాలు, అన్యాయాలు జరిగినప్పుడు రాజ్యాంగం ప్రకారం చట్టం తమను ఆదుకుంటుందన్న ధైర్యం సామాన్యులకు ఇప్పటివరకు ఉందని, కానీ ఇలాంటి నీచమైన అధికారుల వల్ల ఆ ధైర్యం సన్నగిల్లె అవకాశముందన్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన తమకు న్యాయం దక్కదని యువత భావించినప్పుడు చెడు మార్గాన ప్రయాణించి, చట్టాన్ని చేతుల్లో తీసుకునే ప్రమాదం ఉందని ఆయన ఈ సందర్భంగా హేచ్చరించారు. ఖమ్మం రూరల్ సిఐని బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, పరిగణలోకి తీసుకోకపోవడం వల్లనే ఖమ్మం రూరల్ మండలం పోలీస్ స్టేషన్ ను ముట్టడించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలియజేశారు. కమ్యూనిస్టులు ప్రజాహితం కోరుకునే వారని, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ ముట్టడి కార్యక్రమం చేస్తున్నాము తప్ప ఎటువంటి స్వార్థపూరితమైన ఆలోచన లేదని ప్రజలకు ఆయన ఈ సందర్భంగా విన్నవించారు. బోనకల్ మండలంలో ఉన్న ప్రతి సిపిఐ కార్యకర్త ఈ ముట్టడి కార్యక్రమానికి కదలాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 
 ఈ కార్యక్రమంలో జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, మండల కార్యవర్గ సభ్యులు మరీదు ఈశ్వరమ్మ, సీనియర్ నాయకులు జక్కా నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area