డిసెంబర్ 2 లోపు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల ప్రక్రియ చేపట్టాలి

Published: Wednesday November 30, 2022
 వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ బ్యూరో 29 నవంబర్ ప్రజా పాలన : పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తుల ప్రక్రియను డిసెంబర్ 2వ లోపు  చేపట్టాలని కళాశాలల ప్రిన్సిపాల్స్ ను అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోస్ట్ మెట్రిక్ , ఫ్రీ మెట్రిక్ ఉపకార వేతనాలపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్స్, సహాయ సంక్షేమ అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో 85 వివిధ కళాశాలలో చదువుతున్న అర్హులైన  విద్యార్థులకు ఉపకార వేతనాలు అందేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు.  2022- 23 విద్యా సంవత్సరానికి 11475 మంది విద్యార్థులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా  6530 మంది మాత్రమే ఉపకార వేతనాలకై దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అన్నారు.  అదేవిధంగా నూతనంగా 7084 మంది ఉపకార వేతనాలకు అర్హులు కాగా కేవలం 2291  మంది మాత్రమే దరఖాస్తు లు చేసుకోవడం జరిగిందని,  పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తులు చేసుకునేలా సంబంధిత అధికారులు, సిబ్బంది కృషి చేయాలని తెలిపారు. నూతనంగా ఉపకార వేతనాలకై  దరఖాస్తు చేసుకునే ప్రక్రియను డిసెంబర్ 5 లోపు  పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.   ఎస్సీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు  రాజీవ్ విద్యా దీవెన పథకం కింద 647 మంది రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా 566 మంది 9, 10వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, అదే విధంగా న్యూ స్కీం కింద  5 నుండి 8వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న 692 మంది  రెన్యువల్ చేసుకోవాల్సి ఉండగా 506 మంది దరఖాస్తు చేసుకోవడం  జరిగిందని ,  మిగిలిపోయిన విద్యార్థులందరు దరఖాస్తులు చేసుకునేలా అధికారులు ప్రత్యేక చొరవ  చూపాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనాలను సద్వినియోగం చేసుకునేలా  విద్యార్థులకు తోడ్పాటునందించాలని ఆయన తెలిపారు. జిల్లాలోని ఎక్కువమంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తే అధికారులకు, జిల్లాకు మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు. అధికారులు, పాఠశాల ప్రిన్సిపల్ సమన్వయంతో పనిచేసి వంద శాతం ఉపకార వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశాలకు వచ్చే ముందు పక్కా సమాచారంతో సమావేశాలకు హాజరుకావాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం,  వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.