వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం

Published: Monday September 05, 2022

మధిర రూరల్ సెప్టెంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి  మండలంలోని పలు ఆర్ అండ్ బి రహదారిలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు ఏ సమయాన విరిగిపడతాయోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధిర వైరా రోడ్ లో మధిర దెందుకూరు రోడ్లో పలుచోట్ల ఎండన చెట్లు దర్శనమిస్తున్నాయి. దెందుకూరు నుండి విజయవాడ వైపు వెళ్లే రహదారిలో దెందుకూరు బ్రిడ్జి దాటిన తర్వాత ఆర్ అండ్ బి రహదారి పక్కన ఎండిన చెట్లు వంగి రహదారి పైకి వచ్చాయి. ఏ సమయాన ఏ వాహనదారుడుపై ఆ చెట్లు విరిగి పడతాయోనని అటువైపు వెళ్లే ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. ఆ రహదారిలో రెండు మూడు చోట్ల ఎండిన చెట్లు దర్శనమిస్తున్నాయి. ప్రతిరోజు ఆ రహదారిపై ప్రయాణాలు చేసే వాహనదారులు ఆ ప్రాంతానికి వచ్చేసరికి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా వైరా రోడ్లో వెంకటాపురం క్రాస్ రోడ్డు వద్ద బ్రాహ్మణపల్లి బోనకల్ క్రాస్ రోడ్ వద్ద ఎండిన చెట్లు ఉన్నాయి. భారీ వర్షాలు పడుతున్న తరుణంలో ఈదురు గాలులు వచ్చిన సమయంలో ఆ చెట్లు విరిగి వాహనదారులపై పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మామూలుగా గాలి దుమ్ము వచ్చినప్పుడు వాహనదారులపై కొమ్మలు ఇరిగిపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరింత ప్రమాదం జరగకముందే ఆర్ అండ్ బి శాఖ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఎండిన చెట్లను తొలగించాలని ప్రజల కోరుతున్నారు.