ఇంటింటికి సురక్షిత మిషన్ భగీరథ నీరివ్వాలి

Published: Friday March 18, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 17 మార్చి ప్రజాపాలన : ఇంటింటికి సురక్షిత మిషన్ భగీరథ నీరు ఇవ్వాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ "మీతో నేను" కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండల పరిధిలోని కొత్లాపూర్ గ్రామంలో ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పర్యటించారు. గ్రామంలో మిషన్ భగీరథ పైపులకు గేట్ వాల్వ్ ఏర్పాటు చేయాలని సూచించారు. లీకేజీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. నల్లా కనెక్షన్లు ప్రతి ఇంటికి ఇవ్వాలని అన్నారు. నల్లాలకు బిగించిన చర్రలను తీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో సరిపడ నీటిని అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. గ్రామంలో పర్యటిస్తూ అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న బెనిఫిట్స్ సకాలంలో అందించాలని సూచించారు. గ్రామంలో బోర్ మోటర్ల వద్ద సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేసి నీటిని వృధాగా పోనివ్వరాదన్నారు. గ్రామంలో రెండు మూడు వార్డులలో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలన్నారు. పంట పొలాల్లో ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవాలని సూచించారు. ఊరు మధ్యలో పెంటకుప్పలు, పాడుబడ్డ ఇళ్లను తొలగించాలని పేర్కొన్నారు. గ్రామంలో పరిశుభ్రత పాటించాలని గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. 12 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ రెండు టీకాలు ఇప్పించాలన్నారు. గ్రామ ప్రజలందరు ఎలాంటి అపోహాలకు పోకుండా రెండు టీకాలు తీసుకోవాలని సూచించారు. జహీరాబాద్ నుండి వయా బుదేరా, మర్పల్లి, వికారాబాద్ వరకు ఆర్టీసీ బస్సు కావాలని గ్రామస్థులు కోరగా జహీరాబాద్ డిపో మేనేజర్ తో మాట్లాడి బస్సు ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.