పోడు వ్యవసాయ సాగు భూములపై పారదర్శక సర్వే. జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Friday September 23, 2022
మంచిర్యాల బ్యూరో,  సెప్టెంబర్ 21, ప్రజాపాలన :
 
పోడు రైతులకు పట్టాల మంజూరు ప్రక్రియలో ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టం ప్రకారం అందిన దరఖాస్తులపై ప్రభుత్వ ఆదేశాల మేరకు వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని జిల్లా భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, జిల్లా అటవీ అధికారి టి. శివ్ ఆశిష్ సింగ్ కలిసి రెవెన్యూ, అటవీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోకాపై ఉన్న వారికి ముందస్తు సమాచారం అందించి మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుదారులకు సంబంధిత భూమి హద్దులు, ప్రాంతం ఇతరత్రా పూర్తి వివరాలు నమోదు చేయాలని, నిర్ణీత ప్రొఫార్మాలో పోడు రైతులకు సంబంధించి ఆయా వివరాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర సమాచారం నమోదు చేయాలని, ప్రాంతాన్ని గుర్తించేందుకు జి.పి.ఎస్.ను వినియోగించాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణను గుర్తించి పోడు వ్యవసాయ సాగు వివరాలను నమోదు చేయాలని, సర్వే కొరకు నియమించిన బృంద సభ్యులు వారికి కేటాయించిన గ్రామాలకు సంబంధిత పూర్తి వివరాలను కలిగి ఉండాలని, గ్రామపంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, బీట్ అధికారులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో గ్రామ సభ ఏర్పాటు చేసి తీర్మానాలను జిల్లా స్థాయికి అందించాలని తెలిపారు. జిల్లాలో 13 మండలాలలో 88 గ్రామపంచాయతీలు, 120 గ్రామాలల నుండి గిరిజనుల నుండి 4 వేల 486, గిరిజనేతరుల నుండి 7 వేల 452 దరఖాస్తులు అందాయని, గ్రామాలలో ప్రతి రోజు 10 దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు. పోడు వ్యవసాయ సాగు చేస్తూ ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టం ప్రకారం 13 డిసెంబర్, 2005 కంటే ముందు నుండి భూమిలో మోకాపై ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అటవీ, రెవెన్యూ అధికారులు క్షేత్ర పరిశీలనకు వెళ్ళినప్పుడు ఎఫ్.ఆర్.సి. కమిటీకి సమాచారం అందించడంతో పాటు రిజిస్టర్లో వివరాలు నమోదు చేయాలని, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, బీట్ అధికారి క్షేత్ర పరిశీలనకు వెళ్ళినప్పుడు సంబంధిత కోఆర్డినేటర్ ద్వారా జి.పి.ఎస్. నమోదు చేయాలని, ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. గ్రామపంచాయతీల వారిగా దరఖాస్తులను పరిశీలించడానికి కార్యచరణ రూపొందించి తేదీలను నిర్ణయించి సర్వే పనులు ప్రారంభించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఎఫ్.డి.ఓ.లు, ఎఫ్.ఆర్.ఓ.లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.