సుమారు 3.95 కోట్ల రూపాయలతో పటాన్చేరు నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Published: Thursday May 20, 2021

పటాన్ చేరు, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : సుమారు 3.95 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న  పటాన్ చేరు నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ప్రజా ప్రతినిధులు, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నియోజకవర్గ కేంద్రమైన పటాన్ చేరు పట్టణంలో నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు చేయాలన్న సమున్నత లక్ష్యంతో నిర్మాణ పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఆధునాతన హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో అన్ని సదుపాయాలతో కూడిన మార్కెట్ నిర్మాణం పూర్తయితే ఇటు కొనుగోలుదారులకు అటు వ్యాపారస్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో, అవకతవకలకు చోటు లేకుండా క్రయ విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రైతుల కోసం 14 ఎకరాల సువిశాల ప్రాంగణంలో సమీకృత వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఏర్పాటుచేసిన విషయం ప్రజలకు తెలిసిందేనన్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని  అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బల్దియా అధికారి వెంకటరమణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.