ప్రతి మొక్కను పరిరక్షించడం బాధ్యతగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Wednesday December 28, 2022
 జన్నారం, డిసెంబర్ 27, ప్రజాపాలన :
 
నాటిన ప్రతి ఒక్కరు పరిరక్షించడం బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మంగళవారం జిల్లాలోని జన్నారం మండలం రాంపూర్, తిమ్మాపూర్ గ్రామాలలో గల బృహత్ పల్లెప్రకృతి వనాలు, పల్లెప్రకృతి వనాలతో పాటు మన ఊరు మన బడి అభివృద్ధి పనులను ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భావితరాలకు ఆరోగ్యకరమైన సహజ వాయువును అందించడం, వాతావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామ స్థాయి నుండి పరిశుభ్రమైన పరిసరాల నిర్వహణ ఉద్దేశ్యంతో ప్రభుత్వం తెలంగాణకు హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తుందని, ఇందులో భాగంగా బృహత్ పల్లెప్రకృతి వనాలు, ప్రకృతి వనాలలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, సరైన సమయానికి నీటిని అందించాలని, పిచ్చిమొక్కలు, గడ్డిని తొలగించాలని, మొక్కల పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. విద్యారంగ అభివృద్ధి లక్ష్యంగా ప్రైవేట్ పాఠశాలలను ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థినీ, విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని రకాల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం మొదటి విడతలో భాగంగా జిల్లాలో ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన వంట శాలలు, భోజనశాలలు, అదనపు గదులు, మూత్రశాలలు, శౌచాలయాలు, ప్రహారీగోడ ఇతరత్రా అభివృద్ధి పనులను దాదాపు తుది దశకు చేరుకున్నాయని, పెయింటింగ్తో సహా అన్ని పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా మండల విద్యాధికారులు, పాఠశాల యాజమాన్య కమిటీల సమన్వయంతో సంబంధిత అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదతరులు పాల్గొన్నారు.