పులుమామిడి వృద్ధ దంపతులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

Published: Wednesday September 21, 2022
 పొలం అమ్మలేదనే కక్షతో ఎంపీటీసీ కుటుంబ సభ్యుల దౌర్జన్యం
* కొడుకు తెలుగు రాఘవేందర్ లేని సమయంలో తల్లిదండ్రులు భార్యపై దాడి
* జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ఘాటుగా స్పందన
వికారాబాద్ బ్యూరో 20 సెప్టెంబర్ ప్రజా పాలన : చేతిలో అధికారం ఉంది. స్థానిక ఎస్సై అండదండలు పుష్కలంగా ఉన్నాయి. న్యాయాన్యాలను ధర్మాధర్మాలు మరిచి తాను కోరుకున్నదే జరగాలనే మంకుపట్టుతో బలవంతంగానైనా భూములను లాక్కోవడం ఫులుమామిడి ఎంపీటీసీ భర్త సోమన్నోల్ల రామకృష్ణారెడ్డికి సాధారణ విషయమే. నవాబ్ పేట్ మండల పరిధిలోని పులుమామిడి గ్రామానికి చెందిన తెలుగు రాఘవేందర్ తల్లిదండ్రులు తెలుగు యాదయ్య భారతమ్మ భార్య గాయత్రీలపై పులుమామిడి ఎంపీటీసీ భర్త సోమన్నోల్ల రామకృష్ణారెడ్డి, అతని భార్య. సోదరుడు శ్రీనివాస్ రెడ్డి, అతని భార్యలతో కలిసి విచక్షణారహితంగా దాడి చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వివేకవాణి విద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులు  తెలుగు యాదయ్య భారతమ్మ తెలుగు రాఘవేందర్ భార్య గాయత్రీలపై దాడి చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. రక్త గాయాలు వచ్చేంతవరకు చితక బాదడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని ఘాటుగా స్పందించారు. భూ సమస్యలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని హితవు పలికారు. పైశాచికంగా క్రూరంగా ఒక రౌడీ లాగా వ్యవహరించడం అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ భర్త సోమన్నోల్ల రామకృష్ణారెడ్డికి తగదని తెలిపారు. సాధారణంగా మురుదిరాజ్ సామాజిక వర్గం సౌమ్యులు సహృదయులుగా ఉంటారని చెప్పారు. ముదిరాజుల సహనాన్ని పరీక్షిస్తే తట్టుకోలేరని హెచ్చరించారు. ఒక రాజకీయ నాయకుడై పదిమందికి బుద్ధి చెప్పే స్థితిలో ఉన్న పులుమామిడి ఎంపీటీసీ భర్త భూమి కోసం తానే గడ్డి తిన్నాడని ఘాటుగా స్పందించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం పోలీసు వ్యవస్థకే సవాలుగా విసిరాడని స్పష్టం చేశారు. దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని కోరారు. వికారాబాద్ జిల్లా ప్రాంతంలో ఇప్పటివరకు 5 మంది ముదిరాజ్ సామాజిక వర్గంపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా లీగల్ సెల్ అడ్వైజర్ దుద్యాల లక్ష్మణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి మాణిక్యం వికారాబాద్ పట్టణ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు జి లక్ష్మణ్ నియోజకవర్గ అధ్యక్షుడు బి.ఆర్ శేఖర్ పరిగి నియోజకవర్గ అధ్యక్షుడు రామస్వామి గొర్రెంక వెంకటయ్య వివేకవాణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం నాగయ్య మల్లేశం నవాబ్ పేట్ మండల అధ్యక్షుడు మాణయ తదితరులు పాల్గొన్నారు.