హుజూరాబాద్ లో ఈటల గెలుపు ఖాయం

Published: Monday November 01, 2021
బిజెపి యువ మోర్చా రాష్ట్ర అదనపు కార్యదర్శి వివేకానంద రెడ్డి
వికారాబాద్ బ్యూరో 31 అక్టోబర్ ప్రజాపాలన : టిఆర్ఎస్ అరాచక పాలనకు హుజూరాబాద్ ఎన్నికలతో చరమగీతం పాడనున్నారని యువ మోర్చా రాష్ట్ర అదనపు కార్యదర్శి వివేకానంద రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో గాంధీ పార్కులోని గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి భారతీయ జనతా యువ మోర్చా వికారాబాద్ శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఎలక్షన్లో టిఆర్ఎస్ గూండాల  అరాచకాలు అడ్డూ అదుపులేకుండా పోయిందని విమర్శించారు. హుజూరాబాద్ లో శనివారం జరిగిన ఎలక్షన్ లో  ఈవీఎంలను పోలింగ్ బూత్ నుంచి బయటికి తీసుకుపోవడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని దెప్పి పొడిచారు. టిఆర్ఎస్ నాయకుల దౌర్జన్యానికి నిరసనగా వికారాబాద్ గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ విజయం ఖాయం అని తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకులగుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. చివరకు పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు కూడా బయటికి తరలించారని స్పష్టం చేశారు. ఇంతటి అరాచకమైన పాలన ఎక్కడా లేదని టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని చెప్పారు. యువ మోర్చా పట్టణ అధ్యక్షులు సాయి కృష్ణ మాట్లాడుతూ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తప్పకుండా హుజురాబాద్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి  బసవలింగం, పట్టణ ప్రధాన కార్యదర్శి రవితేజ గుప్తా, భాజపా నాయకులు వెంకట్, ఆదర్శ్ విష్ణు  కార్తీక్  సాకేత్ రాహుల్ రమణ తదితరులు పాల్గొన్నారు.