ఎకోసెన్సిటివ్ జోన్ లో ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు

Published: Wednesday June 29, 2022
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
 
ఆసిఫాబాద్ జిల్లా జూన్ 28(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్ కింద నిర్ణయించబడిన గ్రామాలలో మైనింగ్ శాఖతో పాటు ఇతర శాఖలు ఎటువంటి భారీ పరిశ్రమలు స్థాపించడానికి అనుమతి మంజూరు చేయకూడదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాం, అదనపు కలెక్టర్ రాజేశం, ఎఫ్డిఓ దినేష్ కుమార్ లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కవ్వాల్ కోర్ ఏరియా ప్రాంతాన్ని మరింతగా విస్తరించడం జరుగుతుందని, దీనిలో భాగంగా సిర్పూర్ (యు) మండలంలోని రాజు గుడా, తుత్తు గుడా, గ్రామాలను ఎకో సెన్సిటివ్ జోన్ గా గుర్తించడం జరుగుతుందన్నారు. వివిధ శాఖల అధికారులు ఆయా ప్రాంతాలలో ఎలాంటి పరిశ్రమలకు అనుమతించకుండదని, దీని వల్ల  పర్యావరణం చెడిపోయే అవకాశం ఉందన్నారు. జిల్లాలో అటవీ అనుమతులు లేకుండా పూర్తి కాకుండా ఉన్న రోడ్లకు వెంటనే అటవీ అనుమతులు వచ్చేలా చూడాలని సూచించారు. అభివృద్ధి పనులలో ఇలాంటి జాప్యం చేయకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ పెద్దన్న, ఇతర శాఖల అధికారులు  పాల్గొన్నారు.