కంటి వెలుగు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలి

Published: Monday January 23, 2023
* రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
వికారాబాద్ బ్యూరో 21 జనవరి ప్రజా పాలన : జిల్లాలో కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత , సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ...కంటి వెలుగు శిబిరాలను విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ లను, సంబంధిత అధికారులను సీఎస్ అభినందించారు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు క్యాంపులు జరుగుతాయని,  శని ఆదివారాలు క్యాంపులు ఉండవని  సీఎస్ తెలిపారు.  ప్రతి రోజూ ఉదయం 9-15 లోపు కంటి వెలుగు క్యాంపుల సమాచారం అప్ డేట్ చేయాలని సీఎస్ సూచించారు. జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా కంటి వెలుగు క్యాంపులో పర్యటించాలని, జిల్లా కలెక్టర్ లు సదరు బృందాల ఫీడ్ బ్యాక్ తీసుకుని మరింత మెరుగ్గా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. జిల్లాలలో ఉన్న బఫర్ బృందాలను ఉపయోగిస్తూ జర్నలిస్టులకు, ఉద్యోగులకు, పోలీసులకు, కోర్టు సిబ్బంది, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కంటి వెలుగు క్యాంపులను నిర్వహించాలని అన్నారు. జిల్లాలో రాబోయే 15 రోజులలో బఫర్ బృందాల ద్వారా ప్రత్యేక వర్గాల కోసం క్యాంపులు ఏర్పాటు కావాలని, దీనికి అవసరమైన షెడ్యూల్ తయారు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో కంటి వెలుగు క్యాంపు నిర్వహణ సమయంలో పక్కాగా ట్యాబ్ ఎంట్రీ వివరాలు నమోదు కావాలని, ప్రతి రోజూ ట్యాబ్ ఎంట్రీ  పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు.  జిల్లాలో క్వాలిటీ కంట్రోల్ బృందాల ద్వారా ప్రతి రోజూ ఫీడ్ బ్యాక్ తీసుకొని చిన్న, చిన్న లోటుపాట్లను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న రీడింగ్ కళ్ళద్దాల స్టాక్ ను కలెక్టర్లు ప్రతి రోజూ పర్యవేక్షించాలని,  అవసరమైన కళ్ళద్దాల స్టాక్ వివరాలు పాయింట్ల వారిగా ముందుగా సమాచారం అందిస్తే జిల్లాలకు సకాలంలో సరఫరా చేస్తామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం* జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులతో మాట్లాడుతూ... క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు కంటి వెలుగు శిబిరాలను సందర్శిస్తూ ప్రజలు పెద్ద మొత్తంలో ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ లు ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ వార్డ్ అధికారులు,  రిసోర్స్ పర్సన్ లకు వేర్వేరుగా పనులు అప్పజెప్పి కంటి పరీక్షలు పెద్ద మొత్తంలో చేసుకునేలా చూడాలని తెలిపారు. అధికారులు ప్రణాళికబద్ధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకుని వెళ్లాలని కలెక్టర్ సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్ నుండి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ , డిఆర్ఓ అశోక్ కుమార్ , జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పాల్వాన్ కుమార్, డిపిఓ తరుణ్ కుమార్ , పరిగి,  కొడంగల్ మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాసన్, ప్రవీణ్ కుమార్, వికారాబాద్ మునిసిపల్ ఇంచార్జి రామకిషన్ లు పాల్గొన్నారు.