జాతీయ విశిష్ట ప్రతిభా రత్న పురస్కారం నాశ బోయిన

Published: Tuesday July 27, 2021
వలిగొండ, జులై 26, ప్రజాపాలన ప్రతినిధి : గురు పౌర్ణమి పురస్కరించుకొని ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ, హైదరాబాద్ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో విశిష్ట ప్రతిభా రత్న పురస్కారాన్ని నేషనల్ ఔట్ స్టాండింగ్ టాలెంట్ అవార్డ్ 2021 ఆరోగ్య పర్యవేక్షకుడు, కవి, రచయిత నాశబోయిన నరసింహ నాన అందుకున్నారు. ఆదివారం రాత్రి హైద్రాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో జరిగిన జాతీయ స్థాయి విశిష్ట ప్రతిభా పురస్కారాలు 2021 ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ జి.చంద్రయ్య గారు, జాతీయ వినియోగ దారుల మండలి అధ్యక్షులు మందడి కృష్ణారెడ్డి, కూచిపూడి నాట్య గురువులు డా.ఎస్.పి.భారతి, శ్రీ సురభి అకాడమీ డైరెక్టర్ డా.సురభి లక్ష్మీ శారద మొదలైన ప్రముఖుల చేతుల మీదుగా నరసింహకు 'జాతీయ విశిష్ట ప్రతిభా రత్న అవార్డు 2021' ప్రదానం చేసి మెమెంటో, శాలువాతో ఘనంగా సన్మానించారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నరసింహ ప్రస్తుతం వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాదాద్రి జిల్లాలో ఆరోగ్య పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. నరసింహ గత రెండు దశాబ్దాల కాలం నుంచి వైద్య ఆరోగ్యరంగంలో క్షేత్రస్థాయిలో వివిధ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో గ్రామీణ ప్రజలను చైతన్యపరచడం ద్వారా వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వివిధ వైద్యారోగ్య విశిష్ట సేవలకు గుర్తింపుగా, ప్రవృత్తి పరంగా సమాజ హితం కాంక్షించే సామాజిక చైతన్యం కలిగించే సాహితీ సేవలకు గాను ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు డా.ఇ.ఎస్. సూర్యనారాయణ మాస్టారు తనకు ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు చెప్పారు.మరో వైపు జాతీయ విశిష్ట ప్రతిభా పురస్కారం అందుకోవడం పట్ల వైద్యారోగ్యశాఖ సహోద్యోగులు, సాహితీ మిత్రులు, బంధువులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.