ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు

Published: Monday June 13, 2022
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
 
మంచిర్యాల బ్యూరో, జూన్ 12, ప్రజాపాలన :
 
జిల్లాలో  నిర్వహించిన టెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో  జరిగాయని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  నిర్వహించిన టెట్ పరీక్షలో భాగంగా  ఆదివారం జిల్లా కేంద్రంలోని సి.వి.రామన్ కళాశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్
పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టెట్ పరీక్ష నిర్వహణ కోసం జిల్లాలో 81 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు, మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు. టెట్ పరీక్ష మొదటి పేపర్ కు 11 వేల 161 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 10 వేల 360 మంది హాజరయ్యారని తెలిపారు. అదేవిధంగా ,రెండవ పేపర్ కు 7 వేల 932 మంది అభ్యర్థులకు గాను 7 వేల 284 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు త్రాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర వైద్య సేవలు ఇతరత్రా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. రూట్ అధికారులకు, పరీక్షా కేంద్రాల సిబ్బందికి తగు సూచనలు సలహాలు చేశారు. పరీక్ష ముగిసిన అనంతరం సంబంధిత పత్రాలను పోలీసుల బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూంకు తరలించడం జరిగిందని తెలిపారు. అనంతరం జిల్లా విద్యా శాఖ కార్యాలయ పరిధిలో  ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.