మౌళిక భాషా గణిత సామర్థ్యాల సాధన కొరకు 'తొలిమెట్టు' జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Thursday July 28, 2022
మంచిర్యాల బ్యూరో,  జూలై 27, ప్రజాపాలన  :
 
జిల్లాలో మౌళిక భాషా గణిత సామర్థ్యాల సాధన కొరకు 2022-23 విద్యా సంవత్సరం నుండి “తొలిమెట్టు" కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన మండల స్థాయి విషయ నిపుణుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా కారణంగా అభ్యాసన ఫలితాలలో వెనుకబడిన విద్యార్థినీ, విద్యార్థుల సామర్థ్యాలు పెంపొందించడం కొరకు ప్రభుత్వం “తొలిమెట్టు” కార్యక్రమాన్ని చేపట్టిందని, 1 నుండి 5 తరగతుల విద్యార్థులందరికీ ప్రణాళికబద్ధంగా బోధనాభ్యాసన కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు., విద్యా సంవత్సరంలోని 220 పనిదినాలలో బోధనాభ్యాస ప్రక్రియ నిర్వహణ కొరకు 140 రోజుల ప్రణాళిక రూపొందించడం జరిగిందని, వరుసగా వచ్చే 6 పనిదినాలలో 5 రోజులు బోధనాభ్యాసన కొరకు, 1 రోజు మూల్యాంకనం కొరకు కేటాయించడం జరిగిందని , ఆగస్టు 15వ తేదీ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని తెలుగు / ఆంగ్ల / ఉర్దూ మాధ్యమాలలోని 8 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు రీసోర్స్ పర్సన్లుగా రాష్ట్ర స్థాయిలో ఈ నెల 19 నుండి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందని, జిల్లా స్థాయిలో ప్రతి మండలం నుండి 4 మంది మండల స్థాయి రీసోర్స్ పర్సన్లకు ఈ నెల 26, 27, 28 తేదీలలో శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 29వ తేదీన జిల్లాలోని మండల విద్యాధికాఉలకు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు తొలిమెట్టు కార్యక్రమంపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, అనంతరం 510 ప్రాథమిక పాఠశాలలు, 96 ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1 వేయి 120 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఈ నెల 30వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు మొదటి విడత, ఆగస్టు 3 నుండి 6వ తేదీ వరకు రెండవ విడతలలో మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.