అర్హులైన వికలాంగులకు సంక్షేమ పథకాలు అందజేయాలి

Published: Monday May 09, 2022
మంచిర్యాల టౌన్, మే 08, ప్రజాపాలన : అర్హులైన వికలాంగులకు సంక్షేమ పథకాలు అందజేయాలని ఆదివారం రోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎమ్. అడివయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న 3.51 లక్షల ఆసరా పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు, అసెంబ్లీ సమావేశాల్లో ఏప్రిల్ నుండి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు, ప్రతి నెల 5వ తేదీ లోపు పెన్షన్లు చెల్లించాలని అన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇల్లల్లో 5 శాతం వికలాంగులకు కేటాయింపు చేయాలని ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.పల్లె పట్టణ ప్రకృతివనలలో వికలాంగులకు ఉపాధి కల్పించాలని, పట్టణ ప్రాంతాల్లో ఉన్న వికలాంగుల కోసం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని, ప్రభుత్వ కార్యాలయాలు సామూహిక ప్రాంతాలు అన్నింటిలో ర్యాంపులు నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కసర్ల రాజాలింగు, తుడుం రాజలింగు, ఏ. మధు తదితరులు పాల్గొన్నారు.