మాదకద్రవ్యాలు సమాజ మనుగడకే ముప్పు

Published: Monday June 27, 2022

మధిర జూన్ 26 ప్రజా పాలన ప్రతినిధి మాదక ద్రవ్యాలను వినియోగించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని మధిర సిఐ వడ్డేపల్లి మురళి ట్రైనీ ఐపీఎస్ అధికారి సంకీర్త్ హెచ్చరించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం టౌన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్‌ నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. మాదకద్రవ్యాలకు ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని వారు సూచించారు. డ్రగ్స్‌ వినియోగం ప్రాణాంతకమని, దేశ శక్తిని, యువతను నిర్వీర్యం చేస్తుందని తెలిపారు. డ్రగ్స్‌ సమాజ మనుగడకు, యువత జీవితానికి వినాశనకారి అన్నారు. దీన్ని పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రవాణా, వినియోగంపై ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆదేశాలతో పోలీసులు పటిష్ట నిఘా పెట్టినట్లు వారు చెప్పారు. డ్రగ్స్‌ వాడకం వల్ల భవిష్యత్‌ చీకటిమయం అవుతుందని, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉంటే ఉజ్వల భవిష్యత్‌ పొందవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్లో రూరల్ ఎస్సైలు సతీష్ కుమార్ నరేష్ పాల్గొన్నారు.