పీర్జాదిగూడ కార్పొరేషన్ అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది : మంత్రి మల్లారెడ్డి-కలెక్టర్ శ్వేత

Published: Friday July 02, 2021
మేడిపల్లి, జూలై 01 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన పార్కుల అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ డంపింగ్ యార్డ్, ఇంటిగ్రేటెడ్ గ్రేవియార్డ్, మొక్కల పరిరక్షణ కై తీసుకున్న చర్యలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలతో కార్పొరేషన్ ఆదర్శంగా నిలిచిందని కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 3వ విడత పట్టణ ప్రగతి, 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని రాచకొండ కమిషనరేట్ ప్రాంగణంలో మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో కలిసి కార్మిక ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ మొక్కలు నాటారు. అనంతరం 1వ డివిజన్ కమలానగర్ పార్క్ లో నిర్వహించిన వార్డు కమిటీ సమావేశం పాల్గొని హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలు సాదించడంలో వార్డు కమిటీల పాత్ర కీలకమన్నారు. మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ శాఖా మంత్రి కేటిఆర్ ప్రోత్సాహం, మంత్రి మల్లారెడ్డి  సలహాలు సూచనలు, జిల్లా కలెక్టర్ సహకారం మరియు పాలక వర్గం సమిష్టి కృషితో కార్పోరేషన్ ను అభివృద్దిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డి.జాన్ సామ్ సన్, కమిషనర్ శ్రీనివాస్, పట్టణ ప్రగతి ప్రత్యేక అధికారి లింగస్వామి, మేడిపల్లి తహసీల్దార్ ఎస్తేరు అనిత, వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, వార్డు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.