రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

Published: Friday June 17, 2022

వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి 

వికారాబాద్ బ్యూరో జూన్ 16 ప్రజాపాలన :
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ అధికారి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న బాలింతలతో ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, భోజన సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు.  ఆసుపత్రిలో మరుగుదొడ్లలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులను చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలన్నారు.  ఈ సందర్బంగా బాలింతలకు మంత్రి కేసిఆర్ కిట్ ను అందజేశారు.  ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ను శాసన సభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి తో కలసి మంత్రి ప్రారంభించారు.  అంతకు ముందు కోటి రూపాయల వ్యయంతో ప్రతి నియోజక వర్గానికి నిర్మించిన యంఎల్ఏ క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.  స్థానిక శారదా గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల  కొరకు నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల శిబిరంలో మంత్రి పాల్గొని యువతకు స్టడీ మెటీరియల్ అందజేసినారు.  ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం 91 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను విడతల వారిగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు.  కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి కొంత ఆలస్యమైన 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా ప్రభుత్వం కృషి చేయడం జరిగిందన్నారు.  స్థానిక శాసన సభ్యులు నిరుద్యోగ యువతకు మంచి శిక్షణ, భోజన సదుపాయములు కల్పించడం సంతోషదాయకమన్నారు.  గతంలో సిద్దిపేట జిల్లాలో కూడా పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణను అందించి 100 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు.  ఉచిత కోచింగ్ ను అందరు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు పొంది తమ తల్లి దండ్రుల ఆశయాలను సాకారం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు  రంజిత్ రెడ్డి, స్థానిక శాసన సభ్యులు మహేష్ రెడ్డి, వికారాబాద్ శాసన సభ్యులు మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ నిఖిల, గ్రంధాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.