ఐ.ఐ.ఎం లో సీటు సాధించిన తాండూరు విద్యార్థి

Published: Wednesday June 09, 2021
లక్ష రూపాయల ఆర్థిక సహాయం 
చదువుకు పేదరికం అడ్డు కాకూడదు అంటూ విద్యార్థికి మనోధైర్యం
గిరిజన"రత్నానానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బాసట
వికారాబాద్, జూన్ 08, ప్రజాపాలన ప్రతినిధిసీఎం కేసీఆర్ మానసపుత్రిక అయినటువంటి తెలంగాణ గురుకులంలో చదువుతున్న ఓ గిరిజన విద్యార్థి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (పోస్టుగ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం)లో సీటు సాధించినప్పటికి, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ట్రైబల్ స్టూడెంట్ నరేష్ కి చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి బాసటగా నిలిచారు. తన పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం కొర్విచేడ్‌తండాకు చెందిన రాథోడ్‌ శంకర్‌, కమిలిబాయి దంపతులు కూలీ పనులు చేస్తూ తమ కుమారుడు రాథోడ్‌ నరేశ్‌ను చదివిస్తే ఇటీవలె ఐఐఎంలో సీటు సాధించారు. అయితే, నరేశ్‌ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదోతరగతి వరకు, టెన్త్‌ వరకు బషీరాబాద్‌లోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో చదివాడు. తాండూరులో ఇంటర్‌ పూర్తి చేశాడు. సంగారెడ్డిలోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ కళాశాలలో డిగ్రీలో చేరాడు. తృతీయ సంవత్సరం చదువుతూ ఐఐఎం పరీక్ష రాసి సీటు సంపాధించాడు. ఐఐఎంకు ఏటా 2 నుంచి 3 లక్షల మంది విద్యార్థులు పోటీపడుతుండగా కేవలం 5 వేల మందికి మాత్రమే సీటు లభిస్తుంది. ఇందులో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన గిరిజన పుత్రుడు నరేశ్‌ ఎంపిక కావడం విశేషం. కాగా, నరేష్ ఈ విషయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకొంటున్నాడని తెలుసుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి తన వంతు సాయంగా ఒక రూ. లక్ష అందజేశారు. నరేష్ ని తన ఇంటికి పిలుచుకోని ఆర్థిక ఇబ్బందులతో విద్య ఆపవద్దని చెప్పారు. ఏ సాయం కావాలన్న తనని సంప్రదించవచ్చని నరేష్ కి ఎంపీ మనోధైర్యం చెప్పారు. తన విద్య కొనసాగేందుకు సహకారం అందించిన ఎంపీకి విద్యార్ధి నరేష్ కృతజ్ఞతలు తెలిపారు.