తరిగోపులను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి

Published: Wednesday November 30, 2022
 వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 29 నవంబర్ ప్రజా పాలన : తరిగోపుల గ్రామాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ధారూర్ పరిధిలోని తరిగోపుల గ్రామములో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ కోస్నం విశాల వెంకట్రాంరెడ్డితో కలిసి మీతో నేను కార్యక్రమంలో భాగంగా గల్లి గల్లి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజల కోరిక మేరకు త్వరలో తరిగోపుల గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిద్దామన్నారు. అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామంలో కొన్ని కాలనీలకు థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్థంబాలకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి, విద్యుత్ దీపాలు అమర్చాలన్నారు.  పంటపొలాల్లో పలుచోట్ల వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని తెలిపారు. అవసరమైన చోట నూతనంగా విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాన్స్ఫార్మర్ మరో ప్రదేశానికి మార్చాలాన్నారు. గ్రామంలో పాడు బడ్డ ఇండ్లను, పిచ్చిమొక్కలను, మురుగు కాలువలను శుభ్రం చేయకుండా ఏం చేస్తున్నారని, పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో చేయలేని పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పైపుల లీకేజీలను వెంటనే సరి చేయాలన్నారు. ప్రజలకు పరిశుభ్రమైన మంచినీటిని ప్రతి ఇంటికి అందించాలని స్పష్టం చేశారు. ప్రజలు మిషన్ భగీరథ నీటిని త్రాగేలా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామంలోని అవసరమైన చోట రోడ్లు, అండర్ డ్రైనేజ్ నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. పశువుల డాక్టర్ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని పశు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.
తరిగోపుల గ్రామానికి చెందిన కె.యాదమ్మ, ఇ. వెంకటేష్ లకు మంజూరైన రెండు సిఎంఆర్ఎఫ్ చెక్కులను స్వయంగా ఎమ్మెల్యే వారి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. గ్రామంలోని నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ (ఎన్సిడి), (బీపీ, షుగర్ పేషెంట్ల) ఇళ్లకు వెళ్లి ఏఎన్ఎంలు ఆశావర్కర్లు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకొని వాటిని వాడుకలో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి కోస్నం సుజాత మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా మండల రైతుబంధు అధ్యక్షుడు రుద్రారం వెంకటయ్య ముదిరాజ్ మండల ప్రధాన కార్యదర్శి కావలి అంజయ్య ముదిరాజ్ రాజు గుప్తా పిఎసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మండల టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.