అపర చాణక్యుడి పాచిక పారేనా ?

Published: Wednesday April 28, 2021
సిద్దిపేట (ప్రజాపాలన ప్రతినిధి) : సిద్దిపేట అంటేనే హరీష్ రావు, హరీష్ రావు అంటేనే సిద్దిపేట అని అధికార పార్టీ టి ఆర్ ఎస్ కార్యకర్తలే కాదు రాష్ట్ర నాయకులు సైతం ఎన్నో సందర్భాలలో చెపుతుంటారు  సిద్దిపేటపై హరీష్ రావుకు ఉన్న ప్రేమో, మమకారమో మాత్రమే దీనికి కారణం కాదు ఇది నా సొంతగడ్డ, ఇంట గెలిచినవాడే రచ్చ గెలవడానికి అర్హుడు అన్నదే మేనమామ స్ఫూర్తి. మన హరీషుడు  ఇంటా గెలిచాడు, రచ్చా గెలిచి చూపించాడు. ఇక సిద్దిపేట పురపోరులో ఈ అపర చాణక్యుడు పాచికల మీద పాచికలు విసురుతున్నాడు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నాటినుంచే సిద్దిపేట పట్టణంలో దాదాపు అన్ని వీధులలో తారు రోడ్లు వేయించడం మొదలుపెట్టి త్వరితగతిన అన్ని పూర్తి అయ్యే స్థితిలో కి తేవడం, కోమటిచెరువును ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా తీర్చి దిద్దడం, సమీకృత మార్కెట్ భవనం, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరు, అధునాతనమైన గ్రంథాలయం మంజూరు, నెక్లేస్ రోడ్డు నిర్మాణం, మ్యూజికల్ ఫౌంటెన్, రోడ్డు కూడళ్లలో వాటర్ ఫౌంటెన్ లు, పాత బస్టాండ్ ఆధునీకరణ ఇలా చాలా కార్యక్రమాలు, కట్టడాలు నిర్మించిన ఘనత మంత్రి హరీష్ రావుదే అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే రెండవ వైపు హరీష్ రావు  పై విమర్శలు లేకపోలేదు.
విమర్శలు
ప్రధానంగా మంత్రి హరీష్ రావు పై వచ్చే విమర్శలలో మొదటిది. కమర్షియల్ మంత్రి అని ఏ పని చేసిన లాభం లేనిదే ముందడుగు వేయరు అన్నది విమర్శకుల వాదన, ఆ వాదనకు బలం చేకూర్చేలా కోమటిచెరువు లాంటి అభివృద్ధి చేశామని చెపుతున్న ప్రతీ పనిలో తనవారికి దక్కేలా మంత్రి గారు చేశారన్నది విపక్షాల వాదన.ఇంతగా అభివృద్ధి చేశామని చెప్పుకున్న వాటి వల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు దొరికాయి అన్నది మరో వాదన. ఇదే విషయం ఎన్నికలలో ప్రచారానికి వచ్చిన బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పదే పదే ప్రస్తావించారు. ఒక చెరువు సుందరీకరణకు ఇన్ని కోట్లు కేటాయించడం, దాని వల్ల ఎంతమంది యువతకు ఉపాధి లభించింది, అసలు యువతకు ఉపాధి విషయంలో ఇప్పటి వరకు ఒక్క కంపెనీ నైనా తెచ్చారా? లేదా కుటీర పరిశ్రమ లనైన ప్రోత్సహించారా అన్నది విపక్షాల వాదన, ఏదేమైనా విపక్షాలు కొంత బలపడ్డాయి అన్నది వాస్తవమే అయినప్పటికీ అపర చాణక్యుడి ముందు దిగదుడుపే అంటున్నాయి గులాబీ శ్రేణులు, స్వతంత్రులు కూడా మేమేం తక్కువ తినలేదు అని పోటీలో ఉన్నా ఒకవేళ గెలిస్తే మళ్ళీ మంత్రి పంచనే చేరతారన్న అపవాదు జనాలలో బలంగానే ఉంది. చివరగా మంత్రంటే అభిమానం ఉన్నా కూడా అధికార పార్టీలో స్థానిక నేతలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నది సుస్పష్టం, అందుకే ఈమారు ఎక్కువమంది కొత్త వారికి మంత్రి అవకాశం ఇచ్చారన్నది విమర్శకుల వాదన. 30న ఓటరు నాడిని బట్టే పురపాలక భవనంపై ఏ జెండా ఎగురుతుందో తెలియనుంది