మన ఊరు మనబడి పనులను 27 లోపు పూర్తి చేయాలి

Published: Tuesday January 24, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 23 జనవరి ప్రజా పాలన : మన ఊరు మన బడి కింద చేపట్టిన  పనులను ఈ నెల 27 లోపు (శుక్రవారం)  పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత శాఖల ఇంజనీర్లను ఆదేశించారు. సోమవారం మన ఊరు మనబడి కింద  చేపడుతున్న పనుల పురోగతిపై జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి సంబంధిత ఇంజనీర్ విభాగాల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.  జిల్లాలో మన ఊరు మనబడి కింద మొదటి  విడతలో 38 మోడల్ పాఠశాలను  ఎంపిక చేయడం జరిగిందని అందులో 19 పాఠశాలల్లో పనులను వారం రోజులగా పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ తెలిపారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండే పాఠశాలలన్నింటినీ ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ తెలిపారు. పాఠశాలలో నడకబాటకు ఇరువైపులా పూలతోట్లతో సుందరంగా తీర్చిదిద్దేందుకు  చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో వివిధ మౌలిక సదుపాయాల నిమిత్తం తక్కువ ఖర్చుతో చేపట్టాల్సిన   పనులు ఏవైనా మిగిలిపోయి ఎడల   ప్రతిపాదనలు సమర్పించినట్లయితే నిధులు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాలలో ఆట వస్తువుల తోపాటు గ్రీన్ చాక్  బోర్డ్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ ఇఇ శ్రీనివాస్ రెడ్డి , ఆర్ అండ్ బి  ఇఇ లాల్ సింగ్, డీఇలు, ఎఇలు పాల్గొన్నారు.