ఉద్యోగుల హాజరు కోసం సెల్ఫీ అటెండన్స్ యాప్

Published: Wednesday March 23, 2022
జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి
మంచిర్యాల బ్యూరో, మార్చ్ 22, ప్రజాపాలన : రెవెన్యూ, ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది హాజరు తీసుకోవడం కోసం సెల్ఫీ అటెండన్స్ యాప్ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెల్ఫీ ఫేసియల్ అటెండన్స్ యాప్ గోడప్రతిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ నిర్ణీత సమయానికి కార్యాలయానికి హాజరై తమ మొబైల్ ద్వారా జి.పి.ఎన్. కో-ఆర్డినేట్స్ ప్రకారంగా తమ హాజరు ఇవ్వాలని ఆదేశించారు. ఈ యాప్ ద్వారా ఉద్యోగులు కార్యాలయానికి హాజరైన సమయం, కార్యాలయం నుండి వెళుతున్న సమయం రికార్డు అవుతుందని తెలిపారు. సమయపాలన పాటించిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, త్వరలోనే మిగతా శాఖలకు వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు.