ప్రజావాణిలో అందిన దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి ...జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Tuesday December 13, 2022
మంచిర్యాల బ్యూరో, డిసెంబర్ 12, ప్రజాపాలన  :
 
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ గౌతమితో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన బానావత్ గౌరి, బానావత్ గంగ నిరుపేదలు అయిన తమకు జిల్లాలోని సాంఘిక సంక్షేమ కళాశాలలో బి.కాం. కంప్యూటర్స్ మొదటి సంవత్సరం నందు సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. చెన్నూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన దుర్గం కిష్టయ్య తాను 1994 సం॥లో గంగారం గ్రామ శివారులో భూమి కొనుగోలు చేశానని, తన పేరిట పట్టా మార్పు చేసి నూతన పట్టాదారు పాస్ పుస్తకము ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. చెన్నూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన రైతులు తాము అంగ్రాజ్పల్లి గ్రామ శివారులోని భూములలో తమ తాతల కాలం నుండి దాదాపు 1960 సంవత్సరం నుండి కాస్తు చేసుకుంటున్నామని, నిరుపేదలమయిన మాకు భూమి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జన్నారం మండలం ధర్మారం గ్రామ సర్పంచ్ దుర్గం గంగాధర్ తన దరఖాస్తులు ధర్మారం గ్రామపంచాయతీలో గల ప్రభుత్వ భూమిలో ప్రజా ఆరోగ్య అవసరాల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం కొరకు కేటాయించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. నెన్నెల మండలం గుడిపేట గ్రామానికి చెందిన మాలోత్ రమేష్ తాను కళ్యాణలక్ష్మీ కొరకు దరఖాస్తు చేసుకోగా నా ఆధార్ నంబర్ ఇది వరకు వినియోగించినట్లుగా వస్తుందని, ఈ వివరాలను సవరించి పథకం వర్తింపజేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.