రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్ష్యం

Published: Wednesday March 17, 2021
జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 16 ( ప్రజాపాలన ) : రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది ప్రభుత్వ సంస్థ కాదని రైతుల సంస్థ అని రైతులే దీనిని అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపాల్ సెక్రటరీ  సందీప్ కుమార్ సుల్తానియా తెలియజేశారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ముఖ్య అతిధిగా పాల్గొని మంగళవారం వికారాబాద్ జిల్లా, మోమిన్ పేట్ మండలంలోని అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పనితీరును, నిర్వహిస్తున్న రిజిస్టర్ లను అయన  పరిశీలించారు.  ఈ సందర్బంగా  మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మంచి లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా అందరు కృషి చేయాలని సూచించారు. ఈ కంపెనీ ప్రభుత్వ సంస్థ కాదని, ఇది రైతుల సంస్థ అని తెలుపుతూ దీని అభివృద్ధికి కొంత కాలంపాటు ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా కంపెనీకి సంబందించిన నిర్వహణ రిజిస్టర్ లు పరిశీలించి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇకముందు రైతులు పండించిన కూరగాయల పంటలను వారి పొలం వద్దకు వెళ్లి గ్రేడింగ్ చేసి సేకరించాలని తెలిపారు. ఇట్టి కూరగాయలు మార్కెట్ కు తరలించడానికి ట్రాలి వాహనాలు సమకూర్చుకోవాలని సూచించారు. ఇందుకు గాను e-వెహికల్స్ కేటాయించుటకు కృషి చేస్తానన్నారు. రైతుల నుండి సేకరించిన పంటకు సంబంధించి వెంటనే రసీదు అందించాలని తెలిపారు. రైతుల కష్టానికి దళారులు సొమ్ము చేసుకోకుండా రైతులు లాభపడే విధంగా కంపెనీలో కూడా రైతులు, రైతు కుటుంబాలు పనిచేస్తే బాగుంటుందని కోరారు. కంపెనీ చైర్మన్, వైస్ - చైర్మన్ లకు ఇంకా అవగాహన కల్పించేందుకు గాను ఢిల్లీలో నిర్వహిస్తున్న "సఫల్ " అనే కంపెనీకి తీసికొని వెళ్లి పనిలో నైపుణ్యం కల్పించాలని సబంధిత అధికారులకు సూచించారు. కంపెనీకి అవసరమైన ప్లాస్టిక్ ట్రేలు, అవసరమైన ట్రాలి వాహనాలు సమాకూర్చుకోవాలాని తెలిపారు.  కష్టపడితేనే ఫలితం దక్కుతుందని, అందుకు మార్కెటింగ్ బాగా చేయాలన్నారు. ప్రస్తుతం కంపెనీ నిర్వహణ బాగుందని, ఇంకా మెరుగు పర్చూకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో పదివేల ఎఫ్ పిఒ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందని ప్రతి ఎఫ్ పిఒ కు 25 లక్షలు గ్రాంట్ ఇచ్చి రైతుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. కంపెనీకి సంబంధించిన డేటా రిజిస్టర్లు, ఆడిట్ రిజిస్టర్లు ఎప్పటికి అప్పుడు రాసి సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఆలుగడ్డల గ్రేడింగ్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం మోమిన్ పేట మండలంలోని అమ్రాది కలాన్, మేకవనంపల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పర్యటించి చేపట్టిన వైకుంఠదామల పనులను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను సర్పంచులు పూర్తి బాధ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. చేపట్టిన పనుల ఫోటోలను ఇప్పటికప్పుడు పంపాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డిఆర్ డిఒ కృష్ణన్, సెర్ప్ సిఒఒ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ) రజిత, జడ్పీ సి ఇ ఓ ఉషా, హార్టికల్చర్ అధికారి అబ్దుల్, డీపీఎం శ్రీనివాస్, కంపెనీ చైర్మన్, వైస్ చైర్మన్, కంపెనీ సభ్యులు, రైతులు, మహిళా సంఘం సభ్యులతో పాటు ఎంపీడీఓ శైలజా, పిఆర్ఎఈ ప్రణీత్, ఎంపీవో, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.